Advertisement

  • గ్రేటర్ లో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకలు...వేల ఓట్లు గల్లంతు...

గ్రేటర్ లో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకలు...వేల ఓట్లు గల్లంతు...

By: chandrasekar Thu, 12 Nov 2020 1:17 PM

గ్రేటర్ లో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకలు...వేల ఓట్లు గల్లంతు...


ఎల్​బీ నగర్: గ్రేటర్ లో ముసాయిదా ఓటర్ల జాబితా సెప్టెంబర్ 25 వరకు పరిగణలోకి తీసుకొని రూపొందించిన జాబితాలో వేల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ జాబితా చూసి ప్రతిపక్షాలు, ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో ఓట్లున్న చాలా మంది పేర్లు ఈసారి జాబితాలో కనిపించడం లేదు. భార్య ఓటు ఒక చోటుంటే.. భర్త ఓటు మరోచోటకు మారింది. ఒక డివిజన్ లో ఉండాల్సిన ఓట్లను ఇంకెక్కడో సంబంధం లేని డివిజన్ లో కలిపేశారు. కొందరి ఓట్లైతే సిటీ మొత్తంలో ఎక్కడా కనిపించలేదు. ఇలా ఒకటి, రెండు కాదు ప్రతి డివిజన్ లో వేల సంఖ్యలో ఓట్లు తగ్గడంపై అనుమానాలు వస్తున్నాయి. 2016 లో ఉన్న ఓట్ల సంఖ్యను చూస్తే 2020 నవంబర్ నాటికి ఉన్న ఓట్ల సంఖ్య తగ్గటమేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక్క చంపాపేట్ డివిజన్​లో 2016 తో చూస్తే ఇప్పటికీ 15 వేల ఓట్లకు పైగా తగ్గాయి. ఆర్కే పురం డివిజన్ లో 10వేలకు పైగా ఓట్లు కనిపించడం లేదు. సిటీలోని చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి ఉంది. సాధారణంగా కొత్తగా యాడ్ అయ్యే ఓటర్లతో ప్రతి డివిజన్ లో గతంలో కన్నా ఓట్లు ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ గా మారింది.

మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్ లోని హరిపురి కాలనీ, అల్కాపురి కాలనీ, విజయపురి కాలనీ, వాసవీ కాలనీ, టెలిఫోన్ కాలనీ, రామకృష్ణాపురం ఏరియాలకు చెందిన ఓట్లు సరూర్ నగర్ డివిజన్ లో కనిపిస్తున్నాయి. మరికొందరి ఓట్లైతే ఎల్​బీ నగర్ నియోజకవర్గంలోకి మారిపోయాయి. ఆర్కేపురం డివిజన్ ఓట్లు కిలోమీటర్ల దూరం ఉన్న హయత్ నగర్, వనస్థలిపురం డివిజన్లలోకి మార్చడమంటే అధికారులు చేస్తున్న తప్పులు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. బీజేపీకి ఆధిక్యం ఉన్న చోటే ఇలా చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్కేపురంలో బీజేపీ బలంగా ఉండడం, ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ ఉండడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒత్తిడితోనే ఓట్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. గత ఎన్నికల్లోనూ బీజేపీకి బలం ఉన్న చోట్ల ఇలాగే చేశారని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జ్ ధీరజ్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట ఆయా పార్టీలకు మద్దతుగా ఉండే ఓటర్లను గుర్తించి ఓట్లు తీసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంపాపేట డివిజన్ లోనూ ఇదే విధంగా పెద్ద ఎత్తున ఓట్లు తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గల్లంతైన ఓట్లు మళ్లీ నమోదు చేసుకునేందుకు వేరే చోటకు మారినా, అడ్రస్ చేంజ్​చేసుకునేందుకు ఆన్ లైన్ లో ఇప్పుడు అవకాశం లేదు. దీంతో చాలా మంది ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు ఉండడంతో ఓటు ఎలా వేసేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం చేసేదేమీ లేదని, తప్పులు జరిగాయని అంగీకరిస్తున్నారు. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో తప్పుల సవరణకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. 'గత ఎన్నికలకంటే ఇప్పుడు వేల సంఖ్యలో ఓట్లు ఎలా తగ్గుతాయి. డివిజన్ లోని చాలా ఓట్లు ఎల్​బీనగర్ నియోజకవర్గం పరిధిలో చేర్చారు. కావాలనే బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆమె ఒత్తిడితోనే అధికారులు ఓట్లను గల్లంతు చేశారు'. అని ధీరజ్ రెడ్డి, బీ‌జే‌పీ నేత అంటున్నారు.

Tags :
|

Advertisement