Advertisement

కరోనా పేషెంట్ కోసం అంబులెన్సు నడిపిన డాక్టర్

By: chandrasekar Fri, 28 Aug 2020 8:48 PM

కరోనా పేషెంట్ కోసం అంబులెన్సు నడిపిన డాక్టర్


అంబులెన్సు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో డాక్టరే అంబులెన్సు నడిపిన సంఘటన ఒకటి పూణే సమీపంలో చోటుచేసుకుంది. ఇంతకు మునుపు కరోనా పేషెంట్ డెడ్ బాడీని తరలించడానికి మున్సిపాలిటీ ట్రాక్టర్ డ్రైవర్ అంగీకరించకపోవడంతో పెద్దపల్లిలో డాక్టరే స్వయంగా ట్రాక్టర్ నడిపిన ఘటన అందరికి గుర్తుండి ఉంటుంది. పీపీఈ కిట్‌ ధరించి కరోనా మృతదేహాన్ని శ్మశానానికి తరలించిన డాక్టర్ శ్రీరామ్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ప్రశంసలు గుప్పించారు. ఇదే తరహాలో క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఓ కోవిడ్ బాధితుడి ప్రాణాలను కాపాడటం కోసం పుణేకి చెందిన 30 ఏళ్ల ఓ డాక్టర్ అంబులెన్స్ నడిపి అందరి మన్ననలు అందుకుంటున్నారు. బీహెచ్ఎంసీ చదివిన రంజిత్ నికమ్ పుణేలోని పార్వతి ప్రాంతంలో సొంత క్లినిక్ నడుపుతున్నారు.

రంజిత్ నికమ్ మెట్రో మెడికల్ ఫౌండేషన్ అనే ఫోరంలో సభ్యుడుగా ఉండడంతో మార్కెట్ యార్డులోని కోవిడ్ కేర్ సెంటర్లో ఇతర డాక్టర్లతో కలిసి పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో 71 ఏళ్ల కరోనా పేషెంట్‌ ఆక్సిజన్ స్థాయిలు భారీగా తగ్గిపోయాయి. వెంటనే సీనియర్ డాక్టర్లను సంప్రదించడంతో వేరే హాస్పిటల్‌కు షిప్ట్ చేయడం ఉత్తమమని సూచించారు. ఆ కోవిడ్ కేర్ సెంటర్‌లో అంబులెన్స్ అందుబాటులో ఉంది కానీ డ్రైవర్ అనారోగ్యం బారిన పడటంతో అందుబాటులో లేదు. 108కు కాల్ చేసినప్పటికీ కలవలేదు. దీంతో డ్యూటీలో ఉన్న మరో డాక్టర్ రాజ్‌పురోహిత్‌తో కలిసి పేషెంట్‌ను అంబులెన్స్‌లో ఎక్కించారు.

డ్రైవర్ అందుబాటులో లేని కారణంగా అంబులెన్స్ నడిపిన రంజిత్ రెండు హాస్పిటళ్లకు పేషెంట్‌‌ను తీసుకెళ్లినప్పటికీ బెడ్ దొరకలేదు. చివరకు ఆ పేషెంట్‌ను ఓ ప్రయివేట్ హాస్పిటల్‌‌లో చేర్పించారు. అదే సమయంలో కరోనా బారిన పడిన వృద్ధుడి కుమారుడు కూడా అదే కోవిడ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. రాత్రి సమయం కావడం, అంబులెన్స్ లేకపోవడం తన తండ్రి వృద్ధుడు కావడంతో అతడు టెన్షన్ పడ్డాడు. కానీ రంజిత్, రాజ్‌పురోహిత్ ఇద్దరూ కలిసి అంబులెన్స్‌లో తన తండ్రిని తీసుకెళ్లడం బెడ్ దొరక్కపోయినా హాస్పిటళ్ల చుట్టూ తిరిగి చేర్పించడంతో నిజమైన కరోనా పోరాటయోధులంటూ ఇద్దరు డాక్టర్లపై అతడు ప్రశంసలు గుప్పించాడు.

Tags :
|
|
|

Advertisement