Advertisement

  • క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు చేసేందుకు యూఏఈ వెళ్లనున్న డోప్‌ కంట్రోల్‌ అధికారులు

క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు చేసేందుకు యూఏఈ వెళ్లనున్న డోప్‌ కంట్రోల్‌ అధికారులు

By: Sankar Wed, 26 Aug 2020 8:58 PM

క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు చేసేందుకు యూఏఈ వెళ్లనున్న డోప్‌ కంట్రోల్‌ అధికారులు


క్రికెటర్లపై డోపింగ్‌ పరీక్షల విషయంలో ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వరాదని జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) భావిస్తోంది. అందుకే దుబాయ్‌లో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీలో డోపింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ‘నాడా’ నిర్ణయించింది.

ఇందు కోసం శాంపిల్స్‌ను సేకరించేందుకు ‘నాడా’కు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు, ఆరుగురు డోప్‌ కంట్రోల్‌ అధికారులు యూఏఈకి వెళ్లనున్నారు. ఐపీఎల్‌లో కనీసం 50 మంది క్రికెటర్లు శాంపిల్స్‌ తీసుకోవాలని ఈ సంస్థ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ‘నాడాకు చెందిన తొమ్మిది మంది అధికారులు యూఏఈలో ఉంటారు. వారికి యూఏఈ డోపింగ్‌ నిరోధక సంస్థ కూడా సహకరిస్తుంది. మేం సిద్ధం చేసిన బయో బబుల్‌లోనే వారు కూడా ఉంటారు. దీనికయ్యే మొత్తం ఖర్చును ఎవరు భరిస్తారనేది మాత్రం మేం ఇప్పుడే చెప్పలేం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

పరీక్షల కోసం మూడు మ్యాచ్‌ వేదికలతో పాటు రెండు ప్రాక్టీస్‌ వేదికల వద్ద కలిపి మొత్తం ఐదు డోపింగ్‌ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మరో వైపు కొందరు ఆటగాళ్ల బ్లడ్‌ శాంపిల్స్‌ కూడా తీసుకొని ఖతర్‌లో ‘వాడా’ గుర్తింపు పొందిన కేంద్రంలో పరీక్షించే అవకాశం కూడా ఉంది.

Tags :
|
|

Advertisement