Advertisement

నరేంద్ర మోడీ నామస్మరణ చేస్తున్న ట్రంప్

By: Sankar Sun, 13 Sept 2020 4:07 PM

నరేంద్ర మోడీ నామస్మరణ చేస్తున్న ట్రంప్


అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీని తెర మీదకు తెచ్చారు ట్రంప్‌. తన ప్రచారంలో మోదీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ భారతీయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లిక్‌ పార్టీ క్యాంపెయిన్‌లో మోదీ ఫోటోలతో ట్రంప్‌ ప్రచారం చేస్తున్నారు. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో కీలకంగా మారిన భారతీయుల ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. గత ఏడాది హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ వీడియోలను ప్రచారాస్త్రంగా వాడుతున్నారు.

అంతేకాకుండా ప్రత్యర్థి జో బైడెన్, చైనాపై విరుచుకుపడ్డారు. జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టే అంటూ విమర్శించారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రధాన కారణం చైనా అని, జో గెలిస్తే చైనాకు సపోర్ట్ చేస్తారని అన్నారు. అలా జరగకుండా ఉండి, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పాదంలో నిలవాలి అంటే అమెరికన్ ప్రజలు తనకు ఓటు వేయాలని అన్నారు. కరోనా విషయంలో అమెరికా చేపడుతున్న పరీక్షలను, కృషిని భారత ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని అన్నారు..

మరోవైపు కరోనా విషయంలో ట్రంప్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారంటూ జో బైడెన్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ట్రంప్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు బైడెన్. అసత్యాలతో అమెరికన్లను ట్రంప్‌ మోసం చేశారని, కరోనా కరాళ నృత్యం చేస్తుంటే ట్రంప్‌‌ చేతులెత్తేశారని ఆయన ధ్వజమెత్తారు. కరోనా విషయంలో ట్రంప్‌ అసమర్థంగా పని చేశారని దుయ్యబట్టారు బైడెన్‌. అధ్యక్ష విధుల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, ప్రజారోగ్యాన్ని పట్టించుకోలేదని ట్రంప్‌పై ధ్వజమెత్తారు బైడెన్‌. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలో నమోదు కావడానికి ట్రంప్‌ నిర్ణయాలే కారణమని విమర్శించారు.

Tags :
|
|

Advertisement