Advertisement

  • టీఆర్ఎస్ ప్రభుత్వం యాడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?

టీఆర్ఎస్ ప్రభుత్వం యాడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?

By: chandrasekar Sat, 21 Nov 2020 10:37 AM

టీఆర్ఎస్ ప్రభుత్వం యాడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?


టీఆర్ఎస్ ప్రభుత్వం యాడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే దిమ్మ తిరుగుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రకటనల కోసం రూ.310 కోట్లు వెచ్చించినట్లు వెల్లడైంది. సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన ప్రశ్నకు గానూ ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. 2014 జూన్ నుంచి 2018 అక్టోబర్ మధ్య కాలంలోనే అక్షరాలా రూ.310,70,97,327 యాడ్స్ కోసం ఖర్చయ్యాయి. రోడ్ల వెంట హోర్డింగులు, పోస్టర్లు, టీవీ ఛానెళ్లు, ఎఫ్ఎం ప్రసారాల్లో ప్రచారాల కోసం ఈ మొత్తం వెచ్చించినట్లు తేలింది. అవుట్ డోర్ ప్రకటనలకు సుమారు రూ.190 కోట్లు, ప్రాంతీయ, జాతీయ టీవీ ఛానెళ్లలో ప్రకటనల కోసం రూ.119 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. మొదటి సంవత్సరంలో తెలంగాణ అవతరణ దినోత్సవం, సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకార వేడుకల కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది. అదేవిధంగా బోనాలు, బతుకమ్మ పండుగల కోసం కూడా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. తెలంగాణ అవతరణ దినోత్సవం, గోదావరి పుష్కరాలు, మేడారం జాతర, హరిత హారం, కృష్ణా పుష్కరాల కోసం కూడా భారీగా డబ్బు ఖర్చు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రచారం కోసం సుమారు రూ.8.5 కోట్లు ఖర్చు చేశారు.

ఇలా ప్రకటనల కోసం ప్రభుత్వం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొద్ది నెలల ముందుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు వ్యూహం అమలు చేసింది. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో హోర్డింగులు, మెట్రో పిల్లర్లకు బోర్డులు, బస్టాపులపై హోర్డింగ్స్ వంటి వాటిని చాలా వరకూ ముందుగానే బుక్ చేసేసింది. చివరికి ప్రధాన చోట్ల పబ్లిక్ టాయ్‌లైట్స్‌‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలనూ వదల్లేదు. నగరమంతా ప్రముఖంగా ఉన్న ప్రకటనల హోర్డింగ్‌లను ప్రీబుక్ చేసుకోవడంతో విపక్షాలకు యాడ్‌లు ఇచ్చుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. ఇది వినగానే నాకు ఆశ్చర్యమేసింది. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం రూ.67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలంగాణ మున్సిపల్ మినిస్టర్, యువరాజు చెప్పారు. వీటిలో రూ.310 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టినట్లు ఇప్పుడే స్పష్టమైంది. మరి మిగతా రూ.66,506 కోట్ల విలువైన అభివృద్ధి ఏమైనట్లు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రజల పన్నులుగా కట్టిన డబ్బు వృధా అవ్వడం చూసి ఓర్వలేకున్నారు.

Tags :

Advertisement