Advertisement

  • మనిషి చర్మంపై కరోనా వైరస్ ఎన్ని గంటలు జీవించి ఉంటుందో తెలుసా...?

మనిషి చర్మంపై కరోనా వైరస్ ఎన్ని గంటలు జీవించి ఉంటుందో తెలుసా...?

By: chandrasekar Fri, 09 Oct 2020 12:14 PM

మనిషి చర్మంపై కరోనా వైరస్ ఎన్ని గంటలు జీవించి ఉంటుందో తెలుసా...?


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై వివిధ రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పరిశోధకులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ సంక్రమణ గురించి లక్షణాల గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. ఒక్కో అధ్యయనంలో ఒక్కో చేదునిజం వెలుగుచూస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ అంతానికి శానిటైజర్లు వాడుకలో వచ్చాయి. కరోనా వైరస్ కట్టడిలో అసలీ శానిటైజర్ల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి చర్మంపై కరోనా వైరస్ ఎన్ని గంటలు జీవించి ఉంటుందన్నది దీనిపై ఆధారపడి ఉంటుంది.

జపాన్ లోని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ మెడిసిన్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో కరోనా వైరస్ అనేది మనిషి చర్మంపై 9 గంటల వరకూ జీవించి ఉంటుందని తెలిసింది. కరోనా రోగుల మృతదేహాలపై చేసిన ఈ అధ్యయనంలో వెలుగుచూసిన వాస్తవం భయపెడుతోంది. అదే ఫ్లూ వైరస్ అయితే మనిషి చర్మంపై కేవలం 1.8 గంటలు మాత్రమే జీవిస్తుందట. 80 శాతం ఆల్కహాల్ కలిగిన శానిటైజర్లతో చేతిని శుభ్రపర్చుకుంటే 15 సెకన్లలోనే వైరస్ అంతమవుతుందని గుర్తించారు.

సార్స్‌-సీవోవీ-2 ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నివారించడానికి సరైన చేతి పరిశుభ్రత ముఖ్యమని తమ అధ్యయనం చెబుతోందని పరిశోధకులు అంటున్నారు. యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం అక్టోబర్ 3 న ఆక్స్‌ఫర్డ్‌ అకాడమిక్ ఇన్ క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురితమైంది. శానిటైజర్ల వాడకాన్ని తేలికగా తీసుకునేవారికి ఇది కచ్చితంగా ఓ హెచ్చరిక లాంటిదే మరి. ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజర్లతో శుభ్రపర్చుకుంటుంటే వైరస్ కట్టడి సాధ్యమవుతుంది.

Tags :
|

Advertisement