Advertisement

  • ముంబై జట్టు ఫైనల్ చేరిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టులో ధోనీ హాజరు...కానీ...ఇప్పుడు?

ముంబై జట్టు ఫైనల్ చేరిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టులో ధోనీ హాజరు...కానీ...ఇప్పుడు?

By: chandrasekar Fri, 06 Nov 2020 4:00 PM

ముంబై జట్టు ఫైనల్ చేరిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టులో ధోనీ హాజరు...కానీ...ఇప్పుడు?


ఐపీఎల్ 2020 ముంబై ఇండియన్స్.. క్వాలిఫైయర్ మ్యాచ్‌లోనూ ఢిల్లీపై అదే తరహా ఆటతీరుతో గెలుపొందింది. 57 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ముంబై ఐపీఎల్ ఫైనల్ చేరింది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముందు బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే షా, రహానే, ధావన్ పెవిలియన్ చేరారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో షా, రహానే ఔట్ కాగా రెండో ఓవర్లో బుమ్రా శిఖర్ ధావన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ దెబ్బతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. ఓ దశలో 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని మార్కస్ స్టోయినిస్ (65), అక్షర్ పటేల్ (42) ఆదుకున్నారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేయగలిగింది.

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ ఐదు ఫైనల్ మ్యాచ్ లు ఆడగా నాలుగింటిలో గెలుపొందింది. 2010లో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2013, 2015, 2017, 2019 సీజన్లలో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఇప్పటి వరకూ ఆ జట్టు ఫైనల్ చేరిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టులో ధోనీ ఉండటం విశేషం. 2017 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడకపోయినప్పటికీ రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ తరఫున ధోనీ ఫైనల్ ఆడాడు. స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని పుణే జట్టును ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో ఓడించి కప్ గెలిచుకుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమించడంతో ఈ సీజన్లో రోహిత్ సేన కొత్త ప్రత్యర్థితో ఫైనల్లో తలపడనుంది.

Tags :

Advertisement