Advertisement

  • పనాసియా బయోటెక్ ఔషధ సంస్థ ద్వారా త్వరలోనే డెంగ్యూ వ్యాక్సిన్

పనాసియా బయోటెక్ ఔషధ సంస్థ ద్వారా త్వరలోనే డెంగ్యూ వ్యాక్సిన్

By: chandrasekar Fri, 25 Sept 2020 08:51 AM

పనాసియా బయోటెక్ ఔషధ సంస్థ ద్వారా త్వరలోనే డెంగ్యూ వ్యాక్సిన్


పనాసియా బయోటెక్ ఔషధ సంస్థ ద్వారా త్వరలోనే డెంగ్యూ వ్యాక్సిన్ రానున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. టీకా ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుంది? ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రాణాంతకమైన పలు వ్యాధులకు నేటికీ వ్యాక్సిన్‌ లేకపోవడం జీర్ణించుకోలేని వాస్తవం. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులకు ఇప్పటివరకు టీకా రాలేదు. క్యాన్సర్ లాంటి వాటికి నేటికీ సరైన చికిత్స లేదు. అయితే డెంగ్యూ వ్యాక్సిన్ విషయంలో కీలక ముందడుగు పడినట్లు ఔషధ సంస్థ పనాసియా బయోటెక్ ప్రకటించింది. ‘డెంగ్యూ‌ఆల్’ పేరుతో పనాసియా బయోటెక్ ‘డెంగ్యూ’కు వ్యాక్సిన్ రూపొందిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ తొలి, రెండో దశ ప్రయోగాల అధ్యయనం విజయవంతంగా పూర్తయిందని ఆ సంస్థ తెలిపింది. తమ పరిశోధనా ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విశ్లేషించాలని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)ను కోరినట్లు పనాసియా వెల్లడించింది. డెంగ్యూఆల్ వ్యాక్సిన్ తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తైనట్లు ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట్‌లో పనాసియా కంపెనీ షేరు విలువ ఒక్కసారిగా ఐదు శాతం పెరగడం మరో విశేషం. ఇప్పుడు కరోనా తో బాటు చాలా మందికి డెంగ్యూ కూడా వ్యాపిస్తుంది.

రెండు దశల ట్రయల్స్ పూర్తికావడంతో దీని గురించి వివరించారు. ప్రస్తుతం ప్రజలకు వ్యాపిస్తున్న 4 రకాల డెంగీ వైరస్‌ సెరోటైప్‌లను ఎదుర్కోవడంలో తమ టీకా సమర్థంగా పనిచేస్తోందని పనాసియా సంస్థ తెలిపింది. వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఈ వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి చేదు ప్రభావాలు లేవని తెలిపింది. సింగిల్‌ డోస్‌లోనే మెరుగైన ఫలితాలు ఇస్తోందట. దేశంలో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొంత మందికి కరోనా వైరస్‌‌తో పాటు ఈ విష జ్వరం కూడా సోకుతోంది. దీంతో ఆరోగ్యం విషమిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కరోనాతో పాటు డెంగ్యూ కూడా వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డెంగ్యూను కూడా నియంత్రించగలిగితే ఆరోగ్య వ్యవస్థపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించవచ్చని పనాసియా బయోటెక్‌ ఎండీ రాజేష్‌ జైన్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ ‘డెంగ్యూఆల్‌’ టీకా ప్రయోగ ఫలితాలు ఎంతో కీలకమని ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు.

Tags :
|

Advertisement