Advertisement

తెలంగాణలో సచివాలయ భవనం కూల్చివేతపై దుమారం

By: chandrasekar Wed, 08 July 2020 2:22 PM

తెలంగాణలో సచివాలయ భవనం కూల్చివేతపై దుమారం


తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పాత సచివాలయ భవనాన్ని కూల్చేస్తున్నారు.

తెలంగాణలో సచివాలయ భవనం కూల్చివేతపై దుమారం రేగుతోంది. సీఎం కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కరోనా కష్టాల్లో ఉన్న ఈ సమయంలో ప్రజాధనాన్ని వృథా చేస్తారా? అని మండిపడుతున్నారు. సచివాలయంలో వాస్తు బాగాలేదని అలా ఉంటే కేటీఆర్ సీఎం కాలేరన్న కారణంతోనే, ఈ భవనాలను కూల్చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వం తమకు శిథిలావస్థలో ఉన్న భవనాలను అప్పగించిందని పాడుబడ్డ శిథిలాల్లో పాలన కొనసాగించలేకే కొత్త సచివాలయం కడుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ద్రోహపూరితమైన పార్టీ. రాష్ట్ర అభివృద్ధిని విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. బాధ్యతయుతంగా వ్యవరించక పోతే ప్రజల చేతిలో ఆ పార్టీకి కుక్క చావు తప్పదు. ప్రగతి భవన్ కడితే దిగమింగుకోలేక కొన్ని రోజులు ఏడిచారు.

ఇప్పుడు సచివాలయం కడుతామంటే ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నారు. రాష్ట్ర ఔన్నత్యాన్ని దేశానికి ప్రపంచానికి తెలియ జెప్పేందుకే సచివాలయం నిర్మాణం. పాడుబడ్డ శిథిలాలను అప్పగించారు. శిథిలాల కింద పాలన వద్దు అన్నదే ప్రభుత్వ సంకల్పం. అందుకు అనుగుణంగానే సచివాలయాన్ని నిర్మిస్తున్నా. నిండు సభలో సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన హుజుర్నగర్‌లోను మేమే గెలిచాం. ప్రజలు టీఆర్ఎస్‌ వైపే ఉన్నారనడానికి హుజూర్ నగర్ ఫలితమే గీటురాయి.

సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఈ అంశంలో అనుకూలమైన తీర్పు వచ్చింది. దీంతో సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సచివాలయం వైపు వెళ్లే మార్గాలను మూసివేసి ఈ పనులు కొనసాగిస్తోంది. ఈ నెలాఖరు నాటికి సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని సర్కార్ ఆలోచన.

Tags :

Advertisement