Advertisement

కరోనా కారణంగా బాదంకు డిమాండ్‌

By: chandrasekar Tue, 28 July 2020 9:14 PM

కరోనా కారణంగా బాదంకు డిమాండ్‌


బాదం పప్పు ధర ఆకాశంలో ఉండడం వల్ల సామాన్యలకు అందని ద్రాక్షే. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా బాదం వినియోగం విపరీతంగా పెరిగింది. ధనిక పేద అనే వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు బాదంను తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. కరోనా కారణంగా బాదంకు డిమాండ్‌ పెరిగినా ధరలు మాత్రం తగ్గాయి. కరోనాకు ముందు ఎప్పుడో తప్ప బాదంను తినని ప్రజలు ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో చిరు తిండిగా లాగించేస్తున్నారు. మామూలు బాదంను కాకుండా వివిధ రకాల డిష్‌లను కూడా తయారు చేసుకొని ఆరగిస్తున్నారు.

కరోనా ప్రభావంతో సిటీజనులు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాదంను తెగ తినేస్తున్నారు. సాధారణ రోజుల్లో నెలకు 3–4 టన్నుల బాదం విక్రయాలు జరిగితే గడచిన రెండు నెలల్లోనే విక్రయాలు కాస్తా ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగిందని వ్యాపార వర్గాల అంచనా. గతంలో నగర ప్రజలు కేవలం బేగంబజార్‌లోనే బాదం కొనుగోలు చేయడానికి వచ్చే వారు. ప్రస్తుతం కరోనా కారణంగా నగరంలోని దాదాపు అన్ని బస్తీ షాపుల్లోనూ బాదం పప్పు అందుబాటులో ఉంది. దీంతో జనం విరివిగా కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గతంలో రంజాన్‌తోపాటు ఇతర పండుగలప్పుడు మాత్రమే బాదం పప్పు విక్రయాలు ఎక్కువగా ఉండేవి.

జీడి పప్పు తప్ప ఇతర అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ విదేశాల నుంచే నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. బాదం అమెరికా నుంచి దిగుమతి అయితే ఇతర డ్రైఫ్రూట్స్‌ అయిన పిస్తా, అక్రోట్, కిస్మిస్‌తో పాటు ఇతర డ్రైఫూట్స్‌ అష్ఘానిస్తాన్‌తోపాటు యూరప్‌ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. క్యాలిఫోర్నియా బాదంకు ఎక్కువ డిమాండ్‌ ఉందని, గతంలో బాదం పప్పు ధర కేజీ రూ. 950 మొదలుకొని రూ. 850 ఉండేది. ప్రస్తుతం కేజీ రూ. 750 నుంచి రూ. 650 వరకు ఉందని బేగంబజార్‌ కశ్మీర్‌హౌస్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement