Advertisement

  • వాయు కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులు

వాయు కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులు

By: Sankar Tue, 20 Oct 2020 12:53 PM

వాయు కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులు


ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా గాలిలో నాణ్యత క్షీణిస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళలో వ్యాయామం కోసం ఆరు బయటకువచ్చే వారంతా సరిగా ఊపిరాడడం లేదని పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా ఓ వాకర్‌ మాట్లాడుతూ ‘నేను రెగ్యులర్‌గా వాకింగ్‌ చేస్తున్నాను. గత కొద్దిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోంది. నెల రోజుల కిందట ఉన్న కంఫర్ట్‌ లెవల్‌ తగ్గిపోయింది’ అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ ‘నేను శ్వాస, గొంతునొప్పితో బాధపడుతున్నా’ను అని తెలిపారు. వాయుకాలుష్యంతో కరోనా రోగులు, ఉబ్బసంతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఉబ్బసం బాధితులకు వాయు కాలుష్యం విషం లాంటిదని, ఇండ్ల నుంచి బయటకు రావొద్దని వైద్యలు సూచిస్తున్నారు.

కాగా, గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. గత కొద్ది రోజుల్లో పలు చోట్ల గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 300కుపైగా నమోదైంది.

కాలుష్యాన్ని నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. సమస్యను ఎదుర్కొనేందుకు వార్‌ రూమ్‌ ఏర్పాటు, ఇతర రాష్ట్రాలతో సమన్వయం, హాట్‌స్పాట్‌ల గుర్తింపు, జరిమానాల విధింపు, గ్రీన్‌ ఢిల్లీ యాప్‌ ప్రారంభం తదితర చర్యలు చేపడుతున్నట్లు చెప్పింది. ఇవన్నీ విఫలమైతే సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ పేర్కొన్నారు.

Tags :
|

Advertisement