Advertisement

  • వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌

By: chandrasekar Sat, 10 Oct 2020 4:51 PM

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌


ఐపీఎల్‌-13లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 46 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. దీంతో ఢిల్లీ 10 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో రాజస్థాన్‌ మళ్లీ దారుణంగా ఓడింది. జైశ్వాల్ ‌(34) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. 185 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. ఆరంభం నుంచే వికెట్ల పతనం సాగడంతో కోలుకోవడం కష్టమైంది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ బౌలర్ల దెబ్బకు తక్కువ స్కోరుకే ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్‌ చేరడంతో 19.4ఓవర్లలోనే 138 పరుగులకు కుప్పకూలింది.

రాహుల్‌ తెవాటియా (38: 29 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) టాప్‌స్కోరర్‌. మార్కస్‌ స్టాయినీస్ ‌(2/17) అటు బ్యాట్ ఇటు బంతితో ఆల్‌రౌండ్‌షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రబాడ మూడు వికెట్లు తీయగా అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ మూడో ఓవర్‌లోనే స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(13) వికెట్‌ కోల్పోయింది. స్పిన్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో శిఖర్‌ ధావన్‌ స్క్వేర్‌లెగ్‌లో స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో బట్లర్‌ పెవిలియన్‌ చేరాడు. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్‌ 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. దూకుడుగా ఆడే క్రమంలో స్టీవ్‌ స్మిత్‌(24) కూడా నోర్ట్జే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కీలక సమయంలో జట్టును ఆదుకోవాల్సిన సంజూ శాంసన్‌(5) మరోసారి విఫలమైయ్యాడు. జైశ్వాల్‌ ఉన్నంతసేపు స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. స్టాయినీస్‌ వేసిన 13వ ఓవర్‌ మొదటి బంతికే బౌల్డ్‌ కావడంతో రాజస్థాన్‌ ఆశలు వదులుకుంది. చివర్లో మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లారు.

అంతకుముందు మార్కస్‌ స్టాయినీస్‌(39: 30 బంతుల్లో 4సిక్సర్లు), హెట్‌మైర్‌(45: 24 బంతుల్లో ఫోర్‌, 5సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. వీరిద్దరూ క్లిష్ట పరిస్థితుల్లో కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడంతో జట్టుకు మంచి స్కోరు అందించారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌(3/24) ఢిల్లీని బాగా ఇబ్బందిపెట్టాడు. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి సగం ఓవర్లకే ఢిల్లీ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్ దారి పట్టారు.

Tags :

Advertisement