Advertisement

  • పరుగుల పండుగలో కేకేఆర్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

పరుగుల పండుగలో కేకేఆర్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

By: Sankar Sun, 04 Oct 2020 07:05 AM

పరుగుల పండుగలో కేకేఆర్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం


ఈ ఐపీయల్ లో షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్ లు అన్ని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాయి..ఎంత భారీ స్కోర్ సాధించిన కాపాడుకుంటాము అనే నమ్మకం లేనంతగా షార్జాలో బాట్స్మెన్ వీర విహారం చేస్తున్నారు..తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ , కేకేఆర్ మధ్య మ్యాచ్ లో కూడా అదే నిరూపితం అయింది..ఇరుజట్లు పరుగుల హోరులో తడిసిపోయాయి. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ, కేకేఆర్‌లు తలో 14 సిక్స్‌లు కొట్టడం విశేషం.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు ధాటిగా ఆరంభించారు. పృథ్వీ షా ఆది నుంచి కేకేఆర్‌ బౌలర్లపై దాడికి దిగాడు. ఈ జోడి 56 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌(26; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో పృథ్వీషాకు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జత కలిశాడు. ఈ జోడి 73 పరుగులు జత చేసిన తర్వాత పృథ్వీ షా రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

నాగర్‌కోటి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన పృథ్వీ షా.. శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. అనంతరం అయ్యర్‌-పంత్‌ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రతీ ఓవర్‌లో కనీసం పది పరుగులు ఉండాలనే లక్ష్యంతో వీరిద్దరూ బ్యాటింగ్‌ చేశారు. ఒక ఫోర్‌ కొడితే, మరొకరు సిక్స్‌ అన్నట్లు వీరి బ్యాటింగ్‌ సాగింది. ఈ జోడి 90 పరుగులు జత చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తిలకు తలో వికెట్‌ దక్కింది.

ఇక ఢిల్లీ నిర్దేశించిన 229 పరుగుల టార్గెట్‌లో కేకేఆర్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమయ్యింది. కేకేఆర్‌ ఆటగాళ్లలో గిల్‌(28; 22 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌), నితీష్‌ రాణా(58; 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), మోర్గాన్‌(44;18 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి(36; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స్‌లు)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. భారీ లక్ష్య ఛేదన కావడంతో కేకేఆర్‌ పోరాడి ఓడిపోయింది. ప్రధానంగా సునీల్‌ నరైన్‌(3), ఆండ్రీ రసెల్‌(13), దినేశ్‌ కార్తీక్‌(6)లు విఫలం కావడంతో కేకేఆర్‌ ఓటమి కారణమైంది.

ఢిల్లీ బౌలర్లలో నోర్త్‌జే మూడు వికెట్లు సాధించగా, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించాడు. రబడా, స్టోయినిస్‌, మిశ్రాలు తలో వికెట్‌ తీశారు. ఓ దశలో మోర్గాన్‌-త్రిపాఠిలు బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ గుండెల్లో దడపుట్టింది. కాగా, మోర్గాన్‌ నోర్త్‌జే ఔట్‌ చేయడం, ఆపై త్రిపాఠిని స్టోయినిస్‌ బౌల్డ్‌ చేయడంతో కేకేఆర్‌ ఓటమి ఖాయమైంది

Tags :
|
|

Advertisement