Advertisement

  • దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదు..రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదు..రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

By: Sankar Tue, 15 Sept 2020 4:50 PM

దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదు..రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్


భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు.

చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్‌ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్‌లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

గాల్వాన్‌ ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. లద్దాఖ్‌ వద్ద చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చాలన్న కుతంత్రాన్ని మన సైన్యం తిప్పికొట్టిందని చెప్పారు. తీవ్ర కఠిన పరిస్థితుల్లో మన సైన్యం చైనా ఆక్రమణలను అడ్డుకుందని చెప్పారు. సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్‌ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా పదేపదే ఉల్లంఘిస్తోందన్నారు. మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలను, సైన్యాన్ని మోహరిస్తోందని తెలిపారు. భారత్‌ కూడా తగిన రీతిలో సైన్యాన్ని తరలించిందన్నారు. చైనా భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిందని.. చైనా దుశ్చర్యలను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.


Tags :

Advertisement