Advertisement

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా మరణాల రేటు

By: Sankar Thu, 20 Aug 2020 07:38 AM

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా మరణాల రేటు


తెలంగాణా రాష్ట్రంలో కరోనా మరణాల రేటు తగ్గింది. పరీక్షలు, చికిత్సలు విస్తృతం కావడంతో కోవిడ్‌ మరణాల శాతం తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గత నెల 18వ తేదీన కరోనా కేసుల్లో మరణాల శాతం 0.93 శాతం ఉండగా, అది ఆ నెలాఖరుకు 0.82 శాతానికి తగ్గింది. ఈ నెల 1న మరణాల రేటు 0.81 శాతం ఉండగా, ఏడో తేదీ నాటికి 0.79 శాతానికి తగ్గింది. ఇక బుధవారం ఉదయం విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం మంగళవారం నాటికి కరోనా మరణాల శాతం 0.75 శాతానికి తగ్గినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు..

దీంతో రికవరీ రేటు కూడా పెరిగిందని ఆయన తెలిపారు. గత నెల 18న కరోనా కేసుల్లో రికవరీ రేటు 70 శాతముంటే, ఆ నెలాఖరుకు 72.3 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ఈ నెల 18న 77.31 శాతానికి రికవరీ రేటు పెరిగినట్లు బులెటిన్‌లో వెల్లడించారు. జాతీయస్థాయిలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.92 శాతం ఉండగా, మన రాష్ట్రంలో అది సగానికి పైగా తగ్గడం గమనార్హం.

ఇలా మరణాల సంఖ్యా తగ్గడానికి ముఖ్య కారణం కరోనా టెస్టు ల సంఖ్య పెరగడం ..ఒక నెల రోజుల క్రితం వరకు కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది..హైదరాబాద్ లో కూడా కేవలం కొన్ని చోట్ల మాత్రమే కరోనా నిర్దారణ పరీక్షలు చేసేవారు..అయితే ఇప్పుడు రాష్ట్రంలో అని మండల స్థాయి కేంద్రాలలో కరోనా పరీక్షలు చేస్తున్నారు..ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,076 కేంద్రాల్లో యాంటిజెన్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

పైగా అరగంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రస్తుతం 24 వేలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక జిల్లాల్లోనే కరోనా రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం తో మరణాల శాతం తగ్గినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. టెస్ట్‌ల కోసం, చికిత్సల కోసం వేచి చూసే ధోరణి పోయింది. కిందిస్థాయిలోనూ ప్రజల్లో వైరస్‌పై అవగాహన పెరిగింది. వైద్యుల్లోనూ గందరగోళం పోయింది.

దీంతో ఏమాత్రం జ్వరం వచ్చినా జనం అప్రమత్తం అవుతున్నారు. డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అవసరమైతే తక్షణ వైద్యం కోసం పెద్దాసుపత్రులకు వెళ్తున్నారు. వెంటనే స్పందించని వారు మాత్రమే ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. లేకుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు.

Tags :
|
|

Advertisement