Advertisement

  • పాకిస్తాన్‌లో పరిశ్రమలో అగ్నిప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష

పాకిస్తాన్‌లో పరిశ్రమలో అగ్నిప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష

By: chandrasekar Wed, 23 Sept 2020 1:49 PM

పాకిస్తాన్‌లో పరిశ్రమలో అగ్నిప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష


పాకిస్తాన్‌ కోర్టు పరిశ్రమలో అగ్నిప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించింది. దాదాపు 400 మందిని విచారించిన మీదట ఈ అగ్నిప్రమాద ఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొంటూ కరాచీ కోర్టు తీర్పు ఇచ్చింది. పాకిస్తాన్‌ వాణిజ్య రాజధానిలోని బల్దియా పట్టణ ప్రాంతంలోని అలీ ఎంటర్‌ప్రైజెస్‌ కర్మాగారంలో 2012 సెప్టెంబర్‌ 11 న అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 40 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో దాదాపు 264 మంది చనిపోగా మరెందరో గాయపడ్డారు.

అగ్నిప్రమాదం జరిగిన సందర్భంలో ఫ్యాక్టరీలో దాదాపు 500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పలువురు కార్మికులు పై అంతస్తుల నుంచి కిందికి దూకారు. కిటికీల గ్రిల్స్‌ తొలగించేందుకు వీలులేక పలువురు భవనంలోనే చిక్కుకుపోయారు. తలుపులు, మెట్ల ప్రాంతంలో పూర్తిగా వస్త్రాల స్టాక్‌తో నింపేశారు. దాంతో బయటపడేందుకు చాలా మందికి వీలుపడక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. ప్యాక్టరీ యజమానులు అర్షద్‌, షాహిద్‌ భైలాలు కార్మికుల ప్రాణనష్టానికి బాధ్యత వహించలేదు. ప్రమాదం అనంతరం వారిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. వీరిద్దరూ దుబాయ్‌కు వెళ్లడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారిని విచారించారు. తుదకు అగ్నిప్రమాదానికి వీరిద్దరే కారణమంటూ కరాచీ కోర్టు తేల్చి వారికి మరణశిక్ష విధించింది.

అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి కీలక సాక్షి ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పిన సమాచారం మేరకు నగరంలో శక్తివంతమైన ముత్తహిదా కౌమి మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) సభ్యులు కర్మాగారం నుంచి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారికి డబ్బు ఇచ్చేందుకు గార్మెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిరాకరించడంతో వారే ఫ్యాక్టరీకి నిప్పుంటించారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమపై వచ్చిన ఆరోపణలను ఎంక్యూఎం ఖండించింది.

Tags :

Advertisement