Advertisement

సంజయ్‌బారును మోసగించిన సైబర్‌ మోసగాళ్లు

By: chandrasekar Mon, 29 June 2020 2:28 PM

సంజయ్‌బారును మోసగించిన  సైబర్‌ మోసగాళ్లు


భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారును సైబర్‌ మోసగాళ్లు చీటింగ్ చేశారు. ఆన్‌లైన్‌లో మద్యం కోసం ఆర్డర్‌ పెట్టిన సంజయ్‌ బారుకు ఆయన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బు మాయమయ్యేసరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

సంజయ్‌ బారు తనకు ఫేస్‌బుక్‌లో దొరికిన వైన్‌ అమ్మకందారు అయిన లా కెవె వైన్‌ అండ్‌ స్పిరిట్ కు మద్యం ఇంటికి సరఫరా చేయాల్సిందిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టారు. అందుకు రూ.24 వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలని సదరు అమ్మకందారు బారుకు సూచించారు.

దాంతో ఆయన చెప్పినట్లుగా రూ.24 వేలను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌పర్‌ చేశారు. అనంతరం అమ్మకందారు ఫోన్‌ నంబర్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది. ఆన్‌లైన్‌ వేదికగా మద్యం కొనుగోలుకు ప్రయత్నించి సైబర్‌ చీటర్ల చేతిలో మోసపోయానంటూ ఢిల్లీలోని హజ్‌ ఖాస్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంజయ్‌ బారు ఫిర్యాదు చేశారు. సైబర్‌ మోసగాళ్లు పలు బ్యాంకుల్లో వేర్వేరు పేర్లతో అకౌంట్లు తెరిచి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నుంచి సైబర్‌ మోసగాళ్లు సంజయ్‌ బారును మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. భరత్‌పూర్‌లోని పంజాబ్ నేషనల్‌ బ్యాంకులో అకిబ్‌ అనే వ్యక్తి అకౌంట్లో డబ్బు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ వెళ్లిన పోలీసులు అక్కడ అకిబ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు.

Tags :
|
|

Advertisement