Advertisement

గిఫ్ట్ వచ్చిందని ఖాతాలో డబ్బులు నొక్కేశారు

By: Dimple Sun, 06 Sept 2020 10:52 AM

గిఫ్ట్ వచ్చిందని ఖాతాలో డబ్బులు నొక్కేశారు

మీకు నగదు బహమతి వచ్చింది.. సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్‌ చేయండి’ అని కనిపించిన సందేశం ఆయన కొంప ముంచింది. పొంచి ఉన్న మోసాన్ని గుర్తించలేక తన బ్యాంకు ఖాతాలో నగదును పోగొట్టుకోవాల్సి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. రాజాం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 3న వేకువజామున మూడు గంటల సమయంలో గూగుల్‌క్రోమ్‌లో ఒక లింకు వచ్చింది.

మీరు రూ.9,800 నగదు గెలుచుకున్నారు అన్నది దాని సారాంశం. ఆసక్తికొద్ది దానిపై క్లిక్‌ చేశారు. తర్వాత చరవాణిని పక్కనపెట్టేసి నిద్రపోయారు. లేచిన తర్వాత చూసుకుంటే రాజాంలోని తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.58 లక్షలు ఉపసంహరణ అయినట్లు సమాచారం వచ్చింది. వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. ఖాతాలో నగదు మాయమైనట్లు రూఢీ అయింది.

వెంటనే బ్యాంకు ఖాతాను వారు బ్లాక్‌ చేశారు. బ్యాంకు అధికారుల సూచనల మేరకు రాజాం పోలీసులకు విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఆన్‌లైన్‌ మోసం కావటంతో విశాఖలోని సైబర్‌ క్రైం విభాగాన్ని సంప్రదిస్తే ఫలితం ఉంటుందన్న సూచనలు అందటంతో అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పేటీఎం ఖాతాకు నగదు జమైనట్లు తేలింది.

కుమార్తె భవిష్యత్తు కోసం పొదుపు చేసిన సొమ్ములు ఇలా దోపిడీకి గురవ్వటంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ‘బహుమతి, రివార్డు, జాబ్‌ ఇస్తామని, లాటరీ వచ్చిందని ఇలా వివిధ పేర్లతో వస్తున్న సమాచారాలను నమ్మొద్దు. ఏటీఎం కార్డులను, సీవీవీ సంఖ్య, ఏటీఎం కార్డు సంఖ్య ఇతరులకు చెప్పకూడదు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఇతర వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు’ అని రాజాం సీఐ పప్పల శ్రీనివాసరావు కోరారు.

Tags :
|
|

Advertisement