Advertisement

  • అమ్మకు కరోనా.. వచ్చిందని పొలంలో వదిలిపెట్టారు

అమ్మకు కరోనా.. వచ్చిందని పొలంలో వదిలిపెట్టారు

By: Dimple Mon, 07 Sept 2020 09:05 AM

అమ్మకు కరోనా.. వచ్చిందని పొలంలో వదిలిపెట్టారు

నవమాసాలు మోసి... కనిపెంచిన తల్లి.. కాటికి కాల్లు చాచినరోజుల్లో బిడ్డకు భారమైపోయింది. అనారోగ్యంతో ఉందని తమకేమీ పట్టనట్టుగా వ్యవసాయపొలాల్లో వదిలిపెట్టారు. తల్లికి అనారోగ్యంతో ఉన్నపుడు చికిత్స చేయించకపోగా... ఊరికి దూరంగా పొలాల్లో వదిలిపెట్టడాన్ని తెలుసుకున్న పొరుగువారు చలించిపోతున్నారు.

అసలే వృద్ధురాలు. తనపై తానే చేసుకోలేని పరిస్థితి. దీనికితోడు కరోనా మహమ్మారి సోకడంతో కడుపున మోసిన కొడుకులే కాదన్నారు. కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే వ్యవసాయ పొలంలో వదిలేశారు. ఈ అమానవీయ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన లచ్చమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్త, పెద్దకుమారుడు మరణించారు. కొన్ని రోజుల క్రితం లచ్చమ్మకు కాలు విరగడంతో స్టాండు సహాయంతో నడుస్తోంది. ప్రస్తుతం తన పనులే తాను చేసుకోలేని స్థితిలో ఉంది. 15 రోజులకు ఒకరు చొప్పున ముగ్గురు కుమారులు తల్లి బాధ్యతను చూస్తున్నారు.
అందులో ఒక కుమారుడి కుటుంబం కరోనా బారిన పడటంతో లచ్చమ్మకూ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా కారణంగా తల్లి బాధ్యత చూసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తమ వ్యవసాయం పొలం వద్ద ప్లాస్టిక్‌ కవర్‌తో చిన్నపాటి గుడారాన్ని ఏర్పాటు చేసి ఆమెను అక్కడ వదిలేశారు. నీరు, ఆహారం, మందులు ఆమె వద్ద ఉంచారు.

విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు పొలం వద్దకు చేరుకుని కుమారులను పిలిపించారు. తల్లిని ఇంటికి తీసుకెళ్లేందుకు వారు ఒప్పుకోలేదు. ఆమెకు తోడుగా అక్కడే ఉండాలని పోలీసులు చెప్పడంతో వారు కూడా రాత్రి అక్కడే బస చేశారు. పోలీసులు, గ్రామపెద్దలు కుమారులను పిలిపించి మరోమారు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. చివరకు తల్లిని తీసుకొచ్చేందుకు అంగీకరించి పీపీఈ కిట్‌ ధరించి పొలం వద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లారు. తల్లికోసం ఓ కుమారుడు గదిని ఏర్పాటు చేయగా.. చిన్నకుమారుడు ఆమెకు సపర్యలు చేసేందుకు అంగీకరించాడు. వ్యాధి కన్నా దాని భయం వల్ల మనుషుల్లో మానవత్వం నశిస్తోందనడానికి ఇదో ఉదాహరణ.

Tags :
|
|

Advertisement