Advertisement

  • మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్దమైన కొవాగ్జిన్‌ వాక్సిన్

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్దమైన కొవాగ్జిన్‌ వాక్సిన్

By: chandrasekar Sat, 24 Oct 2020 09:33 AM

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్దమైన కొవాగ్జిన్‌ వాక్సిన్


ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు ఇంకా వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం మన దేశంలో భారత్ బయోటెక్ సంస్థ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కొవాగ్జిన్‌ వాక్సిన్ సిద్ధమైంది. దేశ పౌరులకు కరోనా వ్యాక్సిన్‌ను అందించడానికి ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. 2021 జూన్ వరకు టీకాను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. అత్యవసర కేసుల్లో బాధితుల కోసం ప్రభుత్వ ఆమోదంతో అంత కంటే ముందే వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ కరోనా మహమ్మారి నియంత్రణకు కొవాక్సిన్ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పటికే మొదటి, రెండో దశ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తయ్యాయి. తాజాగా మూడో దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తున్నట్లు భారత్ బయోటెక్ శుక్రవారం, అక్టోబర్ 23 ఒక ప్రకటనలో తెలిపింది. కొవాక్సిన్ తొలి, రెండో దశ ప్రయోగాల్లో భాగంగా జంతువులతో పాటు మనుషులపై ప్రయోగాలు జరిపారు.

మొదటి రెండు ట్రయల్స్ లోని పరీక్షల ఫలితాలను అనుసరించి డీజీసీఐ మూడో దశకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 25 వేలకు పైగా వాలంటీర్లతో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి భారత్‌ బయోటెక్‌ సిద్ధమైంది. నవంబర్‌ మొదటి వారంలో కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయిల్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ తొలి దశలో 45 మందికి, రెండో దశలో 55 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్‌ హాస్పిటల్‌లో ఈ ప్రయోగాలు జరిగాయి. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మొదటి, రెండో దశ కలిపి మొత్తం 100 మంది వాలంటీర్లు ఈ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. వాక్సిన్ తీసుకున్న అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సుమారు ఆరు నెలలుగా వాలంటీర్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతోందని వెల్లడించారు. మూడో దశ పరీక్షల్లో భాగంగా నిమ్స్‌లో మరో 200 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకొని భారత్‌తో పాటు పలు దేశాల్లో ప్రజలకు కొవాగ్జిన్‌ను ఇవ్వాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. త్వరగా వాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ ను కట్టడి చేయవచ్చు.

Tags :

Advertisement