Advertisement

  • గుడ్ న్యూస్ ..కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండో దశలోకి అడుగుపెడుతున్న నిమ్స్

గుడ్ న్యూస్ ..కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండో దశలోకి అడుగుపెడుతున్న నిమ్స్

By: Sankar Wed, 19 Aug 2020 4:37 PM

గుడ్ న్యూస్ ..కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండో దశలోకి అడుగుపెడుతున్న నిమ్స్


కరోనా మహమ్మారిని తుదముట్టించే క్రమంలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ 2వ ఫేజ్‌కు నిమ్స్‌కసరత్తు చేపట్టింది. ఐసీఎంఆర్‌ ఆదేశాలకనుగుణంగా కొవాక్జిన్‌ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియను శరవేగంగాకొనసాగిస్తోంది. సంపూర్ణ ఆరోగ్యవంతులపై ప్రయోగించే అంశంలో నిమ్స్‌ వైద్యులు ఏమాత్రం రాజీ లేకుండా ముందుకు అడుగులేస్తున్నారు. నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తూ.. 50 మంది వలంటీర్లకు కొవాక్జిన్‌ టీకాను 3 ఎంఎల్, 6 ఎంఎల్‌ మోతాదులో టీకాలను ఇచ్చింది.

వీరంతా టీకా మందు తీసుకున్న గంటల వ్యవధిలోనే తమ తమ ఇళ్లకు వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరికి బూస్టర్‌ డోస్‌ను సైతం ఇస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపుగా ముగింపు దశకు వస్తోంది. దీంతో క్లినికల్‌ ట్రయల్స్‌లో ఫేజ్‌– 1ను విజయవంతంగా పూర్తి చేసినట్లవుతుంది. ఈ బూస్టర్‌ తీసుకున్న తర్వాత దాదాపు 28 రోజుల పాటు వ్యాక్సిన్‌ పనితీరుపై వైద్యులు దృష్టి పెట్టనున్నారు.

వాస్తవానికి ఈ టీకా తీసుకున్న వలంటీర్లలో ఇప్పటి వరకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ కానరాలేదు. ఇందుకు నిమ్స్‌ వైద్యులు తీసుకున్న జాగ్రత్తలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో రెండు మోతాదుల్లో ఇచ్చిన వ్యాక్సిన్‌లు ఏ విధంగా పని చేస్తున్నాయన్న అంశంపై నిమ్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం అధ్యయనం చేపట్టింది. దీంతో కొవాక్జిన్‌ పనితీరు తేటతెల్లమవుతుందంటున్నారు.

అందులోనూ ఏ మోతాదు ఎంతవరకు పని చేస్తుందన్న అంశంపై స్పష్టత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ తరహా ప్రక్రియ రెండు వారాల పాటు కొనసాగుతుందని నిమ్స్‌ వైద్యులు పేర్కొంటున్నారు. బూస్టర్‌ డోస్‌ ముగిసిన నాటి నుంచి 28 రోజుల వరకు ఆయా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఫేజ్‌–2 ప్రక్రియను చేపట్టేందుకు నిమ్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ వైద్య బృందం కసరత్తు చేపట్టింది.

ఇందులో భాగంగా టీకాలు తీసుకున్న వలంటీర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత మొదటి ఫేజ్‌లో ఇచ్చిన మోతాదుల్లో మెరుగైన ఒక మోతాదు టీకాను ఇవ్వనున్నారు. ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టినట్టే. సెకండ్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్నిస్తున్నాయి. కొవాక్జిన్‌ సెప్టెంబర్‌ నెలలో అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని నిమ్స్‌ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement