Advertisement

  • స్కూల్ తెరిచిన మొదటి రోజే విద్యార్థికి కరోనా...

స్కూల్ తెరిచిన మొదటి రోజే విద్యార్థికి కరోనా...

By: chandrasekar Tue, 03 Nov 2020 9:38 PM

స్కూల్ తెరిచిన మొదటి రోజే విద్యార్థికి కరోనా...


కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో మూతబడ్డ స్కూళ్లు, కాలేజీలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యార్థులు తమ పుస్తకాల దుమ్ము దులుపుతున్నారు. ఇలాంటి తరుణంలో కాస్త ఆందోళనకు గురిచేసే ఘటన డెహ్రాడూన్‌లో చోటు చేసుకుంది. పాఠశాలను తిరిగి ప్రారంభించిన తొలి రోజే ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఫలితంగా 15 మంది విద్యార్థులు హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. పాఠశాలను మూడు రోజుల పాటు మూసేస్తున్నట్లు ప్రకటించి, శానిటైజేషన్ ప్రారంభించారు. లాక్‌డౌన్‌తో సుమారు 7 నెలల తర్వాత పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో 10 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం విద్యాసంస్థలు తిరిగి తెరిపించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి పలు స్కూళ్లను తిరిగి ప్రారంభించారు.

డెహ్రాడూన్‌లో అలా తెరుచుకున్న ఓ బడిలో తరగతులు ప్రారంభమైన కాసేపటికే రాణికేత్‌కు చెందిన ఓ విద్యార్థి (18 ఏళ్లు) తండ్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన అలర్ట్ చేశారు. ఆ తర్వాత ఆ విద్యార్థికి నిర్వహించిన కరోనా పరీక్షలోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన ఓ వ్యక్తిని కాంటాక్ట్ అవడం వల్ల తన కుటుంబసభ్యులకు ఆ వైరస్ సోకిందని విద్యార్థి తండ్రి వెల్లడించారు. తొలి రోజే విద్యార్థి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ పాఠశాల సిబ్బంది నిరుత్సాహానికి గురయ్యారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఇలా జరగడం దురదృష్టకరమని స్కూల్ యాజమాన్యం పేర్కొంది. 15 మంది విద్యార్థుల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించినట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిపారు.

Tags :
|

Advertisement