Advertisement

మాజీ మంత్రి, టీడీపీ నేతకు కరోనా

By: chandrasekar Tue, 25 Aug 2020 5:57 PM

మాజీ మంత్రి, టీడీపీ నేతకు కరోనా


ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా మరో నేత వైరస్ బారిన పడ్డారు. మాజీ మంత్రి, టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా ఆయనకు కొన్ని లక్షణాలు కనిపించడంతో సోమవారం కరోనా పరీక్షలు చేశారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

తనకు కరోనా సోకిందని కరోనాను జయించి మళ్ళీ మీ ముందుకు వస్తానని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, డిప్యూటీ అంజాద్ బాషా, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు అంబటి రాంబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ఎన్. వెంకటయ్య గౌడ్, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు, కే. శ్రీనివాసరావు, విశ్వసరాయి కళావతి కరోనా బారినపడ్డారు. వీరిలో పలువురు ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు.

ఆంధ్ర లో ఇప్పటి వరకు 3,61,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి వీరిలో 2,68,828 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 89,516 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,368 మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ఒక్క జిల్లాలోనే 50,686 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కోవిద్ టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 32,92,501మందికి కోవిద్ పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Tags :
|
|
|

Advertisement