Advertisement

భర్తకు కరోనా పాజిటివ్... భార్యపై కేసు నమోదు...!

By: Anji Wed, 07 Oct 2020 08:51 AM

భర్తకు కరోనా పాజిటివ్... భార్యపై కేసు నమోదు...!

కరోనా బారినపడ్డ భర్తను హాస్పిటల్ చేర్పించకుండా ఇంటికి తీసుకెళ్లిన ఓ మహిళపై కేసు నమోదైంది. నిబంధనలను గాలికి వదిలేసి.. వైద్యుడి సలహాను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ మహిళపై అధికారులు చర్యలు చేపట్టారు. వైద్యుడి ఫిర్యాదు మేరకు అంటువ్యాధుల చట్టం 1897 కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

దేశంలో ఈ చట్టం కింద నమోదైన తొలి కేసు ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి సెప్టెంబరు 28న కరోనా పరీక్ష చేయగా.. పాజిటివ్‌గా తేలింది. అతడిని పరీక్షించిన వైద్యులు హాస్పిటల్‌లో చేర్పించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కానీ, అతడి భార్య ఆ సలహాను పట్టించుకోకుండా తన భర్తను ఇంటికి తీసుకెళ్లింది.

ఆ తర్వాత అతడు తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. ఆ ప్రాంతానికి చెందిన మెడికల్ సూపరిండెంట్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అంటువ్యాధుల చట్టం(Epidemic Diseases Act-1897) లోని సెక్షన్‌ 188 ప్రకారం క్వారంటైన్‌ అవిధేయత (Quarantine Disobedience) కింద ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆమె నిర్లక్ష్యమే భర్త ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు.

మెడికల్ సూపరిండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పవానీ సబ్‌డివిజినల్ అధికారి వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను విస్మరించిన కారణంగా ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైరస్‌ సోకిన వ్యక్తి మరణానికి బంధువులను బాధ్యులను చేస్తూ నమోదు చేసిన మొదటి కేసు ఇదేనని భావిస్తున్నారు.

Tags :

Advertisement