Advertisement

  • శబరిమలలో అయ్యప్ప భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి కలిపి 39 మందికి కరోనా పాజిటివ్‌

శబరిమలలో అయ్యప్ప భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి కలిపి 39 మందికి కరోనా పాజిటివ్‌

By: chandrasekar Fri, 27 Nov 2020 10:14 PM

శబరిమలలో అయ్యప్ప భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి కలిపి 39 మందికి కరోనా పాజిటివ్‌


కార్తీక మాసం మొదలవడంతో శబరిమల యాత్రకు భక్తులు బయలు దేరారు. ఇక్కడ శబరిమలలో 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో అయ్యప్ప భక్తులతో పాటు ఆలయ సిబ్బంది, పోలీసు అధికారులు ఉన్నారు. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు (టీడీబీ) శుక్రవారం, నవంబర్ 27 వెల్లడించింది. వీరిలో 27 మంది ఆలయ సిబ్బందే ఉన్నట్లు తెలిపింది. కరోనా సోకిన వారందరినీ శబరిమలలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు దేవస్థాన బోర్డు తెలిపింది. సన్నిధానం, పంబ, నీలక్కల్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పాయింట్లలో వీరందరికీ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు మొదలు శబరిమలకు దారి తీసే పలు మార్గాల్లో కరోనా పరీక్షల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. డాక్టర్లు, స్పెషలిస్టులు, ఆరోగ్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారు. షిఫ్టుల వారీగా వారు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తూ నెగటివ్‌గా నిర్ధారణ అయిన వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళకు యాత్రికులు చేరుకునే ప్రాంతాలైన తిరువనంతపురం, తిరువళ్ల, చెంగనూర్‌, కొట్టాయం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో యాంటిజెన్‌ పరీక్షల కోసం కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా పరీక్షలు చేయించగా 39 మందికి కరోనా సోకినట్లు వెల్లడైందని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. శబరిమలలో ఏటా నిర్వహించే వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.

ఈ నెలలో భక్తులు ఎక్కువగా స్వామి దర్శనానికి రావడం వల్ల రోజుకు 1000 మంది, వారాంతాల్లో 2000 మంది భక్తులను అనుమతిస్తున్నారు. ఏటా డిసెంబరు 26న మండల పూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా ఈ కార్యక్రమాలకు లక్షలాది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరయ్యే వారే 60 శాతానికి పైగా ఉంటారు. కొవిడ్ మహమ్మారి మొదలైన తర్వాత వార్షిక పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకోవడం ఇదే తొలిసారి. కరోనా నిబంధనల ప్రకారం 10 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిని మాత్రమే ఆలయంలోనికి అనుమతిస్తున్నామని టీడీబీ అధికారులు తెలిపారు. 60 పైబడిన వాళ్ళకి అనుమతి లేదు అలాగే 10 ఏళ్ళ లోపలి పిల్లలకి కూడా అనుమతి లేదు.

Tags :

Advertisement