Advertisement

  • పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలోనే కాక, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లకు కూడా కరోనా

పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలోనే కాక, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లకు కూడా కరోనా

By: chandrasekar Mon, 22 June 2020 2:10 PM

పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలోనే కాక, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లకు కూడా కరోనా


హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిలో ఎక్కువమంది కరోనాకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రసూతి ఆస్పత్రి కావడంతో, నిత్యం వందల మంది వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. నగరంలో ఉన్న 5 ప్రసూతి ఆస్పత్రుల్లో పేట్లబురుజు చాలా ముఖ్యమైనది. ఇక్కడ రోజుకి సుమారు 70 ప్రసవాలు జరుగుతుంటాయి.

రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు ఆరు లక్షల కాన్పులు అవుతుంటాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఆస్పత్రిలోని ఎంత మంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనేదానిపై అధికారులు, సూపరింటెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

కానీ మే చివరి వారంలో ఒక గర్భిణికి సి-సెక్షన్ చేసే క్రమంలో ఆమె నుంచి ఆస్పత్రిలో వారికి వైరస్ వ్యాపించిందని డాక్టర్లు చెబుతున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రికి సిబ్బందికి చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని కూడా తెలిపారు. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలోనే కాదు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. "ఇంతకు ముందు కంటే ఎక్కువ సమయం డ్యూటీ చేయాల్సి వస్తోంది. మాకే కాదు, మా కుటుంబ సభ్యులకు కూడా వైరస్ ప్రమాదం ఉంది. ఇళ్ళకి వెళ్లాలంటే భయం వేస్తోంది. వెళ్ళినా ఒకే గదికే పరిమతం అవుతున్నాము” అని ఒక జూనియర్ డాక్టర్ చెప్పారు.

ఆస్పత్రిలోని కొంత మంది వైద్య సిబ్బందికి కరోనా సోకటంతో, మిగతావారిపై బాధ్యత పెరిగిందని జూనియర్ వైద్యులు చెబుతున్నారు. కొన్నిరోజుల్లో పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "మా పై గత మూడు నెలలుగా పని ఒత్తిడి పెరిగింది, మాలో కొంత మందికి కొరోనా సోకడం, ఇలా ఎన్నో ఒత్తిళ్లలో పరీక్షలు సరిగా రాయలేమేమో అనిపిస్తోంది. ఒక వేళ సరిగా రాయలేక పోతే, మా భవిష్యత్తు మరింత దారుణంగా మారుతుంది. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాము" అని మరో జూనియర్ డాక్టర్ బాధపడ్డారు.

ప్రసూతి ఆస్పత్రులలో పేట్లబురుజు, అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి అత్యంత ముఖ్యమైనవి. వీటితో పాటు, గాంధీలో కూడా గర్భిణులు పరీక్షలు చేయించుకుంటారు. కానీ, ఇప్పుడు దానిని కరోనా రోగుల కోసమే కేటాయించటంతో గర్భిణుల కేసులను అఫ్జల్‌గంజ్ ఆస్పత్రిలో ప్రత్యేక బ్లాక్‌కు తరలించారు. దీంతో వైద్య సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.

గాంధీ ఆస్పత్రిలో 12 మంది డాక్టర్లు, ఆరుగురు వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. "గాంధీలో సుమారు 1100 మంది డాక్టర్లు, 550 మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. కరోనా వ్యాపించిన కొత్తల్లో మూడో వంతు సిబ్బందితోనే వైద్య సేవలు అందించాం. కానీ కేసులు పెరుగుతుండడంతో ఇప్పుడు 50 శాతం సిబ్బందితో పని చేస్తున్నాము. ఈ సిబ్బంది మూడు షిఫ్టులలో పని చేస్తారు. వారం తర్వాత వారు క్వారంటైన్‌లో ఉంటారు. అప్పుడు మరో 50 శాతం సిబ్బంది డ్యూటీలోకి వస్తారు” అని ఆయన కోర్టుకు వివరించారు.

అన్ని ఆస్పత్రుల్లో కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నామని ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొంత మందికి కరోనా సోకటం వల్ల, ఎదురవుతున్న సిబ్బంది కొరతను భర్తీ చేసేంమదుకు జిల్లాల నుంచి పిలిపించిన డాక్టర్లను తాత్కాలికంగా నియమిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags :
|

Advertisement