Advertisement

  • ఆంధ్రప్రదేశ్ లో రిమాండ్ ఖైదీలలో కొందరికి కరోనా

ఆంధ్రప్రదేశ్ లో రిమాండ్ ఖైదీలలో కొందరికి కరోనా

By: chandrasekar Mon, 22 June 2020 4:57 PM

ఆంధ్రప్రదేశ్ లో రిమాండ్ ఖైదీలలో  కొందరికి కరోనా


ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో రిమాండ్ ఖైదీలు కొందరికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకూ 4 జైళ్లలో ఖైదీలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. వారిలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇద్దరు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒకరు , తిరుపతి సబ్ జైల్లో ఒకరు, అనంతపురం జిల్లా జైలులో ఒకరు ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో నమోదయిన కేసులలో ఇద్దరినీ ప్రస్తుతం కోవిడ్-19 ఆసుపత్రికి తరలించారు. వారిని ఓ దొంగతనం కేసులో చిన్నబజార్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, కోర్టు ఆదేశాలతో 12వ తేదీన రిమాండ్‌కి తరలించిన్నట్టు జైలు అదికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో 15వ తేదీన వారిని ఆసుపత్రికి తరలించారు.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా పాజిటివ్ నమోదయిన నిందితుడు విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రకటించారు. అత్యాచారం కేసులో అరెస్టయి ఈనెల 16వ తేదీన రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వచ్చినట్టు వెల్లడించారు. అతన్ని క్వారంటైన్ కి తరలించారు. జైలులో అతనితో పాటు ఉన్న ఖైదీలుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జైలు ప్రకటించారు. తమిళనాడుకి చెందిన ఓ నిందితుణ్ణి బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో తిరుపతి జైలుకి రిమాండ్ కోసం తరలించారు. అతనికి పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం రుయా ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ కి తరలించారు.

అనంతపురం జిల్లా జైలులో కూడా ఓ అండర్ ట్రయల్ ఖైదీకి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసులన్నీ రిమాండ్ ఖైదీలకు సంబంధించినవే. జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో వైరస్ కేసులు ఇంతవరకూ లేవని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న సుమారు 600 మంది ఖైదీలను ఇంటీరియమ్ బెయిల్ పై విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సాధారణ కేసుల్లో ఇరుక్కున్న వారిని అప్పట్లో విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ మే మధ్యలో తిరిగి వారంతా జైళ్లకి చేరినట్టు అధికారులు ప్రకటించారు. అప్పట్లో కేసులు నమోదు కాకపోవడంతో అందరినీ తిరిగి జైళ్లకి తరలించారు.

ప్రస్తుతం కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పెరోల్ పై పంపించే ప్రతిపాదన పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. కరోనా కేసులు విస్తృతమవుతున్న సమయంలో ఖైదీల విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని మళ్లీ సొంత ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేయాలని మానవహక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కోరుతున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు, టీడీపీ నేత అస్మిత్ రెడ్డిని ఈనెల 13నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. లారీలు, బస్సుల రిజిస్ట్రేషన్లలో పాల్పడిన అవకతవకల ఆరోఫణలపై వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కానీ, వారిని రిమాండ్ లో తీసుకోవడానికి అనంతపురం జిల్లా జైలు అధికారులు ఆసక్తిచూపలేదు. దాంతో వారి ఉత్తర్వులలో మార్పు చేసిన మళ్లీ అనంతపురం నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప సెంట్రల్ జైలుకి తరలించాల్సి వచ్చింది. జైలులో వారిద్దరినీ చేర్చుకోపోవడానికి కారణం కరోనా వైరస్. సరిగ్గా 13వ తేదీనే అండర్ ట్రయల్ ఖైదీకి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం కావాల్సి వచ్చింది. జైలులో 3 రోజుల పాటు రిమాండ్ లో ఉండగా ఆ కరోనా పాజిటివ్ వచ్చిన నిందితుడితో సఖ్యతగా ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. సిబ్బంది కూడా కొంత ఆందోళనకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో కొత్తగా రిమాండ్ ఖైదీలను వెంటనే చేర్చుకోవడం సాధ్యం కాదని చెప్పాల్సి వచ్చింది. దాంతో హుటాహుటిన ఆదేశాలు మార్చి కడప తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 4 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. వాటితో పాటుగా జిల్లా జైళ్లు 8, స్పెషల్ సబ్ జైల్స్ 11, మహిళా జైలు 1, సబ్ జైళ్ళు 60 ఉన్నాయి. వాటిలో సుమారుగా 5వేల మంది ఖైదీలున్నారు.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే జైళ్ల శాఖ అప్రమత్తం కావడంతో పాటుగా పలు మార్పులు కూడా చేసినట్టు జైళ్ల శాఖ ఐజీ జి జయవర్థన్ బీబీసీకి తెలిపారు. ఆయన మాట్లాడుతూ "జైళ్లలో ఖైదీల విషయంలో భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా మార్పులు చేశాం. గదుల్లో ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్తలు పడుతున్నాం. ప్రతీ ఖైదీకి మాస్కూలు ధరించేలా ఆదేశాలు ఇచ్చాము. వాటిని పంపిణీ చేశాము. శానిటైజర్లు అందిస్తున్నాం. జైలు లోపల వైరస్ ఉండే అవకాశం లేదు. బయటి నుంచి వెళ్లే వారితోనే సమస్య రావచ్చు. అందుకు తగ్గట్టుగా కొత్తగా వచ్చే వారందరికీ పరీక్షలు చేయిస్తున్నాం.

రిమాండ్ ఖైదీల విషయంలో కూడా 21 రోజుల పాటు క్వారంటైన్ పాటించేలా చూస్తున్నాం. కొన్ని సబ్ జైళ్లలో అలాంటివి పాటించడానికి అవసరమైనన్ని గదులు లేవు. అయినప్పటికీ తగు రీతిలో వ్యవహరించాలని సూచించాము. సిబ్బంది కూడా అన్ని జాగ్రత్తలు పాటించేలా ఆదేశాలు ఇచ్చాము. నిత్యం ఇళ్లకు పోయి వచ్చే సిబ్బంది పూర్తి శానిటైజేషన్ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నాము. ఇప్పటి వరకూ ఈ జాగ్రత్తలు ఫలించాయి. 3నెలలుగా జైలు లోపల ఉన్న వారికి కరోనా వచ్చిన దాఖలాలు లేవు" అంటూ వివరించారు.

ఏప్రిల్ మొదటి నుంచి ఇప్పటి వరకూ జైల్లోకి కొత్తగా వెళ్లే ఖైదీలందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలుత టెస్టింగ్ శాంపిల్ స్వీకరించిన తర్వాత మాత్రమే వారిని అనుమతిస్తున్నారు. అయితే వారు జైలులో రిమాండ్ కి వెళ్లిన తర్వాత రెండు, మూడు రోజులకు రిపోర్ట్ వస్తున్నాయి. జూన్ రెండో వారం వరకూ జైళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు వరుసగా ఒక్కో జైలులో కేసుల సంఖ్య కనిపిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే నాలుగు జైళ్లలో కేసులు రావడంతో కొంత కంగారు పెడుతోంది. తిరుపతి జైల్లో కరోనా నమోదు అయిన వెంటనే సిబ్బంది 16 మందితో పాటుగా 72 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు.

కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన పి రమేష్ కుటుంబ వ్యవహరాల కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అతని పరిస్థితిపై కుటుంబంలో ఆందోళన మొదలయ్యింది. రమేష్‌ తల్లి గడిచిన రెండు వారాల్లో రెండుసార్లు జైలు వరకూ వెళ్లినట్టు చెబుతున్నారు. కానీ జైళ్ల శాఖ మార్చిన నిబంధనల ప్రకారం ఆమెకు ప్రత్యక్ష ఇంటర్వ్యూ దక్కడం లేదు. వారానికి నాలుగు రోజుల పాటు రోజుకి 10 నిమిషాల చొప్పున ఫోన్ కాల్స్ కి అనుమతిస్తున్నామని జైళ్ల శాఖ ఐజీ బీబీసీకి తెలిపారు. ఖైదీలు సూచించిన రెండు నెంబర్లలో మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చామన్నారు. దాని వల్ల నేరుగా ఇంటర్వ్యూలు లేకపోయినా వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఊరట కలిగించేలా ఈ మార్పు చేసినట్టు ఆయన వివరించారు.

వసంత తో పాటుగా వందల మంది ఖైదీల కుటుంబాల్లో ఇలాంటి ఆందోళన కొంత ఉన్నప్పటికీ ప్రస్తుతానికి జైళ్లన్నీ సురక్షితంగానే ఉన్నాయని ఏపీ జైళ్ల శాఖ చెబుతోంది. తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల ఫలితం ఇస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జైళ్ల ఖైదీలతో ప్రత్యేక ఇంటర్వ్యూల విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐజీ తెలిపారు.

Tags :
|
|

Advertisement