Advertisement

తమిళనాడులో కోయంబేడును కలవర పెడుతున్న కరోనా...

By: chandrasekar Tue, 13 Oct 2020 4:21 PM

తమిళనాడులో  కోయంబేడును కలవర పెడుతున్న కరోనా...


తమిళనాడులో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం తెలిపిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో మొత్తం 80,162 శాంపిళ్లను పరీక్షించగా, 4879 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6.61లక్షలకు పెరిగింది. గత 24 గంటల్లోనే కరోనా కాటుకు 62 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,314కు పెరిగింది. తమిళనాట రికవరీ రేటు గణనీయంగా ఉండటంతో ఇప్పటికే 6.07లక్షల మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 43,747గా ఉంది.

ఇదిలా ఉంటే.. అతి పెద్ద హోల్‌ సేల్‌ మార్కెట్లలో ఒకటైన చెన్నైలోని కోయంబేడు మార్కెట్ లో మరోసారి వైరస్ కలకలం రేపింది. కరోనా కారణంగా చాలా కాలం మూతపడి, రెండు వారాల కిందటే తెరుచుకున్న ఈ మార్కెట్లో సోమవారం నిర్వహించిన కరోనా‌ పరీక్షల్లో 50మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దక్షిణాదిలో కరోనా వ్యాప్తికి ఈ మార్కెట్ గతంలో ఎపిసెంటర్ గా ఉండిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కోయంబేడులో తాజాగా కరోనా సోకినవారిలో ఎక్కువమంది విక్రేతలే ఉన్నారని, మొత్తం 3500 శాంపిల్స్‌ పరీక్షించగా 50మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ఇక్కడ రోజూ దాదాపు 200మందికి పరీక్షలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సరకుతో వాహనాలు వస్తున్నందున మార్కెట్‌లో నిత్యం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు చెన్నై కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు.

Tags :
|

Advertisement