Advertisement

ప్లాస్మా థెరఫీకి దాతల కరువు

By: Sankar Fri, 19 June 2020 7:03 PM

ప్లాస్మా థెరఫీకి దాతల కరువు



కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం ప్లాస్మాథెరపీ. వైరస్‌ బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకున్న పలువురు బాధితులు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా చికిత్సల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్సలు నిర్వహించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి ఇవ్వడంతో మే 11న ప్లాస్మాథెరపీ చికిత్సలు ప్రారంభించారు. కరోనా సోకి పూర్తిస్థాయిలో నయమైన రోగుల్లో వైరస్‌ను నిర్మూలించే యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. మానవ శరీరంలో రక్తంతో మిళితమై ఉన్న ప్లాస్మా యాంటీబాడీలను ప్రత్యేక పద్ధతుల ద్వారా బయటకు తీసి వాటిని ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా బాధితులకు ఎక్కిస్తారు. బాధితుల శరీరంలో చేరిన యాండీబాడీలు కరోనా వైరస్‌తో పోరాడి నిర్మూలించడంతో రోగి కోలుకుని ప్రాణాపాయం నుంచి బయటపడతాడు..

corona,discharge,patients,feel,fear,donate,plasma ,ప్లాస్మా థెరఫీ, కరోనా,  ప్రాణాలు, ఐసీఎంఆర్‌, గాంధీఆస్పత్రి



గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన ప్లాస్మా థెరపీ చికిత్సలు విజయవంతం కావడంతో మరింతమంది కరోనా రోగులకు ఇదే తరహా చికిత్సలు అందించాలని వైద్యులు నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్లాస్మా థెరపీ చికిత్సలు అందించిన ఐదుగురు రోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులై డిశ్చార్జీ కావడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌కు చికిత్స పొంది కోలుకున్న బాధితులు వేలసంఖ్యలో ఉన్నారు. ప్రారంభంలో వీరంతా ప్లాస్మా దానం చేసేందుకు అంగీకరించారు. 50 ఏళ్లలోపు ఉండి ఇతర రుగ్మతలు లేనివారి నుంచే ప్లాస్మా సేకరించాలనే ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం 36 మంది ప్లాస్మా దాతలను గుర్తించారు. వీరిలో ఇప్పటికి కేవలం పదిమంది మాత్రమే ప్లాస్మా దానం చేసినట్లు తెలిసింది.


ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్లాస్మా కోసం దాతలను సంప్రదిస్తే కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, యాంటీబాడీలు దానం చేస్తే మల్లీ కరోనా వైరస్‌ వచ్చే అవకాశం ఉందంటూ పలు కారణాలతో దానం చేసేందుకు అంగీకరించడంలేదని తెలిసింది. ప్లాస్మా దాతలు ముందుకు రాకపోవడంతో చికిత్సలకు బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. తక్షణమే తెలంగాణ ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు, సామాజికవేత్తలు స్పందించి ప్లాస్మాదానం, చికిత్సలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి, దాతలు ముందుకు వచ్చేలా తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :
|
|
|
|

Advertisement