Advertisement

  • వ్యర్థాలను నాశనం చేసే క్రమంలో సిబ్బంది సైతం కరోనా తాకిడి

వ్యర్థాలను నాశనం చేసే క్రమంలో సిబ్బంది సైతం కరోనా తాకిడి

By: chandrasekar Thu, 25 June 2020 6:23 PM

వ్యర్థాలను నాశనం చేసే క్రమంలో సిబ్బంది సైతం కరోనా తాకిడి


దేశం లో కరోనా అన్ని ప్రాంతాలలో అధిగ స్థాయిలో పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అందుకు తగ్గట్టుగా కరోనా వ్యర్థాలు కూడా టన్నుల కొద్దీ తయారవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా చికిత్స వల్ల ఉత్పన్నమవుతున్న వ్యర్థాలు వంద టన్నులు దాటినట్లుగా అధికారులు చెబుతున్నారు.

కరోనా సోకిన రోగులు వాడి పారేసిన లేదా వారి చికిత్స కోసం వైద్యులు ఉపయోగించిన వస్తువులను నాశనం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇలాంటి వ్యర్థాలు రోజుకు సుమారు ఒక టన్నుకు పైగానే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాక, ఆ వ్యర్థాలను నాశనం చేసే క్రమంలో సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు.

కరోనా సోకిన రోగులకు ఆస్పత్రులు లేదా క్వారంటైన్‌ కేంద్రాల్లో వాడిన మాస్కులు, గ్లౌసులు, బట్టలు, మలమూత్రాలు, వారికి వాడే సిరంజిలు, దూది, పీపీఈ కిట్లు, మందుల కవర్లు, తదితరాలను కోవిడ్‌ వ్యర్థాలుగా పేర్కొంటారు.

కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ వ్యర్థాల మొత్తం కూడా రోజురోజుకూ అధికంగానే ఉంటోంది. వీటిని సాధారణ వ్యర్థాలతోపాటే పడేస్తే వైరస్ మరింతగా సోకే ప్రమాదం ఉన్నందున వీటిని వేరుగా బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాలకు తరలించి పర్యావరణానికి హాని కలగని రీతిలో నాశనం చేస్తున్నారు.

కరోనా వ్యర్థాలను ప్రత్యేక యంత్రాల్లో కాల్చి బూడిద చేస్తారు. ఈ బూడిదను హైదరాబాద్ శివారు దుండిగల్‌లోని హజార్డస్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రానికి తరలించి అక్కడ బూడిదను మళ్లీ వివిధ రసాయనాలతో శుద్ధిచేసి ప్రత్యేక బాక్సుల్లో నిల్వచేసి భూమిలో అత్యంత లోతున పూడ్చివేస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 25 మందికి కరోనా సోకినట్లుగా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చెప్పారు.

రాష్ట్రంలో ప్రధానంగా కరోనా చికిత్స, ఆ పరీక్షల కోసం ఉన్న 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 128 క్వారంటైన్‌ కేంద్రాలు, 7 కరోనా పరీక్షల కేంద్రాలు, ప్రయోగశాలల నుంచి రోజూ ఇలాంటి వ్యర్థాలు బయటకు వస్తున్నాయి.

వీటిని రాష్ట్రంలో వివిధ చోట్ల ఉన్న బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాలకు తరలించి పర్యావరణానికి హాని కలగని రీతిలో నాశనం చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సేకరించేందుకు సుమారు 55 ప్రత్యేక వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ సుమారు వంద టన్నుల వ్యర్థాలను తాము సేకరించామని, వివిధ కేంద్రాల్లో నిర్వీర్యం చేసినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వెల్లడించారు.

Tags :
|

Advertisement