Advertisement

3 నెలల తర్వాత చైనాలో కరోనా రెండోసారి విజృంభణ

By: chandrasekar Thu, 30 July 2020 11:00 AM

3 నెలల తర్వాత చైనాలో కరోనా రెండోసారి విజృంభణ


చైనాలో కరోనా రెండోసారి విజృంభిస్తుందా అనే ఆందోళన నెలకొంది. కరోనా వైరస్‌కు జన్మస్థానమైన చైనాలో బుధవారం (జులై 29) కొత్తగా 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన కేసుల్లో 98 లోకల్ ట్రాన్సిమిటెడ్ కేసులు కావడం గమనార్హం. మరో 3 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

లోకల్ కేసుల్లో షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనే 89 కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. చైనాలో గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఒకే రోజు 100కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. చైనాలో చివరిసారిగా ఏప్రిల్‌ 13న ఒకే రోజు 108 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. మళ్లీ కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు.

చైనాలో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఒక్క బీజింగ్‌లోనే 10 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు పత్రికా కథనాల్లో పేర్కొన్నారు. కేసులు బయటపడుతున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు 84,060 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్తగా కేసులు నమోదవుతున్నా మరణాలేవీ చోటు చేసుకోలేదని అక్కడి పత్రికల్లో రాశారు. ప్రపంచవ్యాప్తంగా కోటి 67 లక్షల మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మహమ్మారి ఇప్పటివరకు 6 లక్షల 60 వేల మందిని బలి తీసుకుంది.

Tags :
|
|

Advertisement