Advertisement

కరోనాను జయించిన కాంగ్రెస్ సీనియర్ నేత

By: Sankar Fri, 03 July 2020 11:37 AM

కరోనాను జయించిన కాంగ్రెస్ సీనియర్ నేత



కరోనా వైరస్ వస్తే ముసలి వాళ్ళు, మధుమేహం , గుండె జబ్బులు లాంటివి ఉన్నవాళ్లు కోలుకోవడం చాల కష్టం అని అందుకే వారిని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు తరుచుగా చెబుతున్నారు.. అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు మాత్రం కరోనా ను జయించాడు ..కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 71 ఏళ్ల వయసున్న వీహెచ్‌, మధుమేహ సమస్యతో బాధపడుతున్నా కేవలం 10 రోజుల్లోనే స్వస్థత పొంది బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జ్‌ అయ్యారు. ప్రజల ఆశీర్వాదం, సంకల్ప బలమే తనను కరోనా నుంచి కోలుకునేట్లు చేసిందని వీహెచ్‌ పేర్కొన్నారు.

వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ చేశారని వెల్లడించారు. కరోనా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్న వీహెచ్‌కు జ్వరం, దగ్గు తదితర లక్షణాలు కనిపించడంతో స్వతహాగా వైద్యులైన ఆయన కూతురు, అల్లుడు పరీక్షలు చేయించారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో జూన్‌ 21న వీహెచ్‌, అపోలో ఆస్పత్రిలో చేరారు. వీహెచ్‌ భార్య చంద్రకళకూ పాజిటివ్‌గా రావడంతో ఆమెను అదే ఆస్పత్రిలో చేర్చారు. ఆక్సిజన్‌తో పాటు, జ్వరం, దగ్గు తగ్గేందుకు మందులు వాడటంతో వీహెచ్‌ కోలుకున్నారు.

ఆస్పత్రిలో సాధారణంగా అందజేసే శాకాహార భోజనమే తీసుకున్నానని వీహెచ్‌ తెలిపారు. ఢిల్లీలో ఉన్నప్పుడు తాను జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవాడినని, హైదరాబాద్‌లో రోజూ ఉదయం నడుస్తుంటానని.. ఇలా రోజువారీ వ్యాయామం కూడా తనను కోలుకునేలా చేసిందన్నారు. ఎన్ని మందులు వాడినా మానసిక స్థైర్యం ముఖ్యమని ఆయన చెప్పారు. వీహెచ్‌ భార్య చంద్రకళ కూడా 60 ఏళ్ల వయసులో కరోనా వైర్‌సను జయించడంతో వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు.

కరోనా నుంచి కోలుకున్న తాను మిగిలిన జీవితాన్ని.. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి.. ఇందిర ఆలోచనలను అమలు చేయడానికే అంకితం చేస్తానని వీహెచ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags :
|

Advertisement