Advertisement

  • దుబ్బాకలో టీఆర్‌ఎస్ గులాబీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డి

దుబ్బాకలో టీఆర్‌ఎస్ గులాబీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డి

By: chandrasekar Tue, 13 Oct 2020 09:55 AM

దుబ్బాకలో టీఆర్‌ఎస్ గులాబీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డి


దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డి టీఆర్‌ఎస్ గులాబీ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు దక్కవని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌ రావు చెప్పారు. దుబ్బాకలో ఏం చేశారని ఓట్లు అడుగుతారని ప్రతిపక్ష పార్టీలను ఆయన నిలదీశారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన మద్దుల నాగేశ్వరరెడ్డి సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు హరీశ్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో కవిత ఘన విజయం సాధించారని, ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్‌ కూడా దక్కలేదని, అదే తరహాలో దుబ్బాకలోనూ టీఆర్‌ఎస్‌ను విజయం వరిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ను ప్రజలే కాదు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా విశ్వసించడంలేదని, అందుకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.

టీఆర్‌ఎస్‌ దుబ్బాక అభివృద్ధికి పాటుబడడం వల్ల విజయం సాధించిందని తెలిపారు. ఫార్మా సిటీని అడ్డుకుంటామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసులు వేశారని తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తామంటే వద్దన్నరన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా దుబ్బాకలో ఇంటింటికి నల్లా నీటిని అందించింది సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. ఈ పథకానికి కూడా రుణం ఇవ్వొద్దని హడ్కోకు లేఖ రాశారని తెలిపారు. ఇలా అన్నింటినీ కాంగ్రెస్‌ వద్దన్నదని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను వద్దన్నారని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ దుబ్బాకలో ఖాళీ అయిందని, కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ ఇతర ప్రాంతాల నాయకులతో సోమవారం అక్కడ సమావేశం పెట్టుకున్నారని తెలిపారు.

కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిందే చెప్తుందని, చెప్పిందే చేస్తుందన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరానని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

Tags :

Advertisement