Advertisement

కరోనా... ఓం గుణపాఠం నేర్పింది

By: Dimple Thu, 13 Aug 2020 04:37 AM

కరోనా... ఓం గుణపాఠం నేర్పింది

ప్రధాని మోదీ మంగళవారం దిల్లీ నుంచి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో సమావేశంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. దేశంలో కరోనా నియంత్రణ, రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధానితో చర్చించారు. ‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సౌకర్యాలు పెంచాల్సిన అవసరాన్ని ఈ వైరస్‌ గుర్తు చేసింది. వైద్య రంగంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ముందుచూపుతో ఆలోచించాలి. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళికలు రూపొందించి కేంద్రం, రాష్ట్రాలు కలిసి అమలు చేయాలి.
మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులుంటుందో తెలియదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమంది వైద్యులు ఉండాలి? ఇంకా ఎన్ని వైద్య కళాశాలలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఇది దేశానికి మంచి చేసే చర్య. దీనికోసం ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలి. కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేసి, దేశంలో వసతులు, వనరులు పెంచాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి సూచించారు.తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి నియంత్రణలో ఉంది. పరీక్షలను పెంచి మెరుగైన చికిత్సను అందిస్తున్నాం. ఐసీఎంఆర్‌, నీతి ఆయోగ్‌, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నాయి’ అని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, విభాగాధిపతులు శ్రీనివాసరావు, రమేశ్‌ రెడ్డి, గంగాధర్‌, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్‌ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉందని, వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా తట్టుకునే విధంగా దేశంలో ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. తెలంగాణలో కొవిడ్‌ నివారణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, వ్యాధి నుంచి కోలుకునే వారు 71 శాతం కాగా మరణాల రేటు 0.7 శాతంగా ఉందని చెప్పారు. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని, వ్యాధి సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కావల్సినన్ని పడకలు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రిని సిద్ధంగా ఉంచామన్నారు.

Tags :
|

Advertisement