Advertisement

కొత్త సచివాలయంలో 3 ప్రార్థన మందిరాల ఏర్పాటు

By: Sankar Sun, 06 Sept 2020 10:20 AM

కొత్త సచివాలయంలో 3  ప్రార్థన మందిరాల ఏర్పాటు


కొత్తగా నిర్మించే సచివాలయంలో మందిరం, మసీదు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. శనివారం కొత్త సెక్రటేరియట్‌లో ప్రార్థనామందిరాల నిర్మా ణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. వారినుంచి అభిప్రాయాలు సూచనలు తీసుకొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాత సచివాలయం కూల్చివేస్తున్న సమయంలో అక్కడున్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందని, వాటిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు..పాత సెక్రటేరియట్‌లో ఉన్న స్థలంలోనే మసీదులను నిర్మించి వక్ఫ్‌ బోర్డుకు అప్పగిస్తామని సీఎం తెలిపారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేవాలయ నిర్మాణాన్ని పూర్తిచేసి దేవాదాయ శాఖకు అప్పగిస్తామని వెల్లడించారు. కొత్త సెక్రటేరియట్‌ ప్రాంగణంలో తమకూ ప్రార్థనామందిరం కావాలన్న క్రిస్టయన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుందని పేర్కొన్నారు..

సచివాలయంలో కూల్చివేసిన మసీదుల స్థానంలో కొత్తవి నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం హర్షణీయమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం దారుల్‌ సలాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం ఐక్యతకు నిదర్శనమని, అన్ని మతాల ప్రజలు కలిసి ఉంటారని పేర్కొన్నారు. అన్ని వర్గాల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ కొత్త సెక్రటేరియట్‌లో ప్రార్థనా మందిరాలు నిర్మించాలని నిర్ణయించారని, వచ్చే నెల మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

Tags :
|
|
|
|

Advertisement