Advertisement

అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో కెసిఆర్‌

By: Dimple Fri, 28 Aug 2020 01:40 AM

అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యేలతో కెసిఆర్‌

తెరాస ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం వారితో సమీక్షించారు. ప్రభుత్వపరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలు అసెంబ్లీ వేదికగా వివరించాలని సమావేశంలో ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రజాపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాలన్నారు.

అనంతరం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సహా పలువురు అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే సెర్చ్‌ కమిటీల నియామకం పూర్తయిందని.. వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతోందన్నారు. కరోనా కారణంగా నియామకాల్లో జాప్యం జరిగిందని చెప్పారు. ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని.. దీన్ని సీఎస్‌ స్వయంగా పర్యవేక్షించాలని కేసీఆర్‌ ఆదేశించారు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌ల ఏర్పాటుకు నాబార్డ్‌ ఆర్థికసాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌తో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే. దేశంలో ఆహార ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి, మనదేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దీని కోసం నాబార్డ్‌ అధ్యయనం చేయాలి.

వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయడంతోపాటు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనూ పోత్సహించాలి. కూలీల కొరత అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి. నాటు వేసే, కలుపు తీసే, పంటలు కోసే యంత్రాలు అందుబాటులోకి రావాలి. వీటికి సంబంధించి సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

Tags :
|
|

Advertisement