Advertisement

  • సీఎం జగన్ మరో చారిత్రక నిర్ణయం...మహిళా ఖైదీల విడుదల...

సీఎం జగన్ మరో చారిత్రక నిర్ణయం...మహిళా ఖైదీల విడుదల...

By: chandrasekar Sat, 07 Nov 2020 12:04 PM

సీఎం జగన్ మరో చారిత్రక నిర్ణయం...మహిళా ఖైదీల విడుదల...


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం హోం మంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఖైదీల విషయంలో దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మహిళా ఖైదీల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్లకు పైగా శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఉన్న 147 మంది మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదలకు అర్హత కలిగి ఉన్నారని ప్రకటించారు. పూర్తి పరివర్తనతో బయటకు వచ్చిన ఖైదీలు కుటుంబాలతో సంతోషంగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా వారి కాళ్లపై వారు నిలిచేలా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జైల్లో ఉన్న మహిళా ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, క్షణికావేశంలో కొందరు మహిళలు నేరాలు చేశారని, వీరు శిక్ష అనుభవిస్తూ కుమిలిపోతున్నారని హోం మంత్రి అన్నారు. నేరాల్లో వారి పాత్ర ఎంత అనే విషయంపై కూడా విచారణ చేసి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇంత మంది మహిళా ఖైదీల విడుదల ఒకేసారి జరగడం చారిత్రాత్మకమని అన్నారు. కడప, విశాఖపట్నం జైళ్లను సందర్శించినపుడు అక్కడి మహిళ ఖైదీల బాధలు విన్నానని, వారి అభ్యర్థనను ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పగా ఆయన ఎంతో మంచి మనసుతో అంగీకరించారని హోం మంత్రి వెల్లడించారు. వారం రోజుల్లోపు వీరందరినీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పురుష ఖైదీల విడుదలకు సంబంధించి జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి వెల్లడించారు.

Tags :

Advertisement