Advertisement

  • భారత సరిహద్దులో నియంత్రణ రేఖ దాటిన చైనా సైనికుడు,,,

భారత సరిహద్దులో నియంత్రణ రేఖ దాటిన చైనా సైనికుడు,,,

By: chandrasekar Tue, 20 Oct 2020 6:00 PM

భారత సరిహద్దులో నియంత్రణ రేఖ దాటిన చైనా సైనికుడు,,,


భారత సైన్యం లడఖ్‌లోని చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో చైనా సైనికుడిని అరెస్టు చేసింది. అతను భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో ఆర్మీ అదుపులోకి తీసుకున్నది. అయితే, అతను అనుకోకుండా పొరపాటున సరిహద్దు దాటి ఉండవచ్చని భారత సైన్యం అభిప్రాయం. ఈ సైనికుడిని ప్రోటోకాల్ కింద చైనా సైన్యానికి తిరిగి అప్పగిస్తామని ఇండియన్‌ ఆర్మీ వెల్లడించింది. లడఖ్‌లో చైనా సైనికుడు ఒకరు వాస్తవ నియంత్రణ రేఖ దాటిన తరువాత అతన్ని పట్టుకున్నట్లు సైన్యం సోమవారం పేర్కొంది. కార్పోరల్ వాంగ్ యా లాంగ్‌గా గుర్తించిన ఈ సైనికుడు.. చుమర్-డెమ్చోక్ ప్రాంతంలో పట్టుబడినట్లు సైన్యం తెలిపింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుడిని ప్రోటోకాల్ ప్రకారం చైనా సైన్యానికి తిరిగి అప్పగిస్తామని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సైనికుడికి ఆక్సిజన్, ఆహారం, వెచ్చని దుస్తులతోపాటు వైద్య సహాయం అందించినట్లు, తీవ్రమైన ఎత్తు, కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి అతన్ని రక్షించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తప్పిపోయిన సైనికుడు ఆచూకీ గురించి చైనా సైన్యం నుంచి భారత సైన్యానికి అభ్యర్థన అందింది. ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత అతడిని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో చైనా అధికారులకు తిరిగి అప్పజెపుదామని ఇండియన్‌ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. భారత సైన్యం శీతాకాలంలో కూడా లడఖ్ ఎత్తైన ప్రదేశాల్లో ఉండేందుకు సన్నాహాలు చేసింది. పెద్ద ఎత్తులో ఉన్న ప్రాంతాల్లోని సైన్యానికి అందించేందుకు అమెరికా నుంచి యుద్ధ కిట్లు, శీతాకాలపు దుస్తులను భారత్‌ కొనుగోలు చేసింది.

భారత దళాలు లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సుకి దక్షిణంగా 13 ముఖ్యమైన శిఖరాలను ఆక్రమించాయి. ఇక్కడ మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి అక్టోబర్ 12 న చుషుల్‌లో జరిగిన కోర్ కమాండర్ స్థాయి సమావేశం దాదాపు 11 గంటలపాటు కొనసాగింది. కాని అంతకుముందు జరిగిన సమావేశాల మాదిరిగానే ఎటువంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో చైనా 60 వేల మంది సైనికులను మోహరించినట్లు అమెరికా గత వారం పేర్కొంది. కొద్ది రోజుల క్రితం జరిగిన క్వాడ్ నేషన్స్ సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ ఈ సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement