Advertisement

  • మ‌ళ్లీ చైనా షాకిచ్చింది...బుబోనిక్ ప్లేగు... 24 గంట‌ల్లోనే మరణం...

మ‌ళ్లీ చైనా షాకిచ్చింది...బుబోనిక్ ప్లేగు... 24 గంట‌ల్లోనే మరణం...

By: chandrasekar Tue, 07 July 2020 6:26 PM

మ‌ళ్లీ చైనా షాకిచ్చింది...బుబోనిక్ ప్లేగు... 24 గంట‌ల్లోనే మరణం...


చైనా మ‌ళ్లీ షాకిచ్చింది. ఈసారి ఓ బ్యాక్టీరియా వ్యాధి గురించి హెచ్చ‌రించింది. ఉత్త‌ర చైనాలోని మంగోలియా స్వతంత్ర ప్రాంతంలో ఉన్న బ‌య‌న్నూర్ ప‌ట్ట‌ణంలో బుబోనిక్ ప్లేగు కేసు న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. దీంతో ఆ సిటీలో లెవ‌ల్‌-3 ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ప్లేగును నియంత్రించేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లను తీసుకుంటున్నారు. ఎలుక లేదా ఉడ‌త జాతికి చెందిన మాంసాన్ని తిన‌డం వ‌ల్ల బుబోనిక్ ప్లేగు వ్యాధి సంక్ర‌మించే అవ‌శాలు ఉన్నాయి.

ఇద్ద‌రు అన్నాద‌మ్ములు మార్మ‌ట్ మీట్ తిన‌డం వ‌ల్ల వారికి ప్లేగు వ్యాధి సోకిన‌ట్లు తేలింది. వెస్ట్ర‌న్ మంగోలియాలోని కోవిడ్ ప్రావిన్సులో ఉన్న వేరువేరు హాస్పిట‌ల్లో ఆ ఇద్ద‌రూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఇద్ద‌రికీ కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన 146 మంది ట్రేస్ చేసి ఐసోలేట్ చేశారు. బుబోనిక్ ప్లేగు అనేది ఓ బ్యాక్టీరియా వ్యాధి. ఎలుక, ఉడ‌త‌లు లాంటి జీవుల‌పై ఉండే ఈగ‌ల వ‌ల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

ఈ వ్యాధి సోకిన వ్య‌క్తి స‌రైన స‌మ‌యంలో చికిత్స చేయ‌కుంటే కేవ‌లం 24 గంట‌ల్లోనే ప్రాణాల‌ను వ‌దిలేస్తాడు. గ‌త ఏడాది మంగోలియాలోని బ‌యాన్ ప్రావిన్సులో నాటు ఎలుక‌ల‌ను తిన‌డం వ‌ల్ల గ‌త ఏడాది ఓ జంట చ‌నిపోయింది. కొన్ని రోజుల క్రిత‌మే పందుల‌తో వ్యాపించే ఇన్‌ఫ్లూయాంజా వైర‌స్ గురించి చైనా శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. జీ4 ఈఏ హెచ్‌1ఏ1 వైర‌స్ చాలా ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించారు.

మ‌ధ్య‌యుగంలో బుబోనిక్ ప్లేగు వ‌ల్ల యూరోప్‌లో సుమారు 50 మిలియ‌న్ల మంది మ‌ర‌ణించిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. మూడు ర‌కాలైన ప్లేగుల్లో బుబోనిక్ ప్లేగు ఒక‌టి. దీని వ‌ల్ల నొప్పులు, వంటి వాపు, జ్వ‌రం, వ‌ణుకుడు, ద‌గ్గు లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. బుబోనిక్ ప్లేగు కేసు న‌మోదు అయిన నేప‌థ్యంలో బ‌య‌న్నూరు సిటీలో అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇన్‌ఫెక్ష‌న్ సోక‌కుండా ఉండాలంటే మాంసాహారాన్ని మానాలంటున్నారు. వేట‌ను కూడా ఆపేయాల‌న్నారు.

1911లో వ‌చ్చిన మ‌హ‌మ్మారి ప్లేగుకు మార్మ‌ట్ మాంస‌మే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈశాన్య చైనాలో ఆ ప్లేగు వ‌ల్ల సుమారు 63 వేల మంది మ‌ర‌ణించారు. ఎలుక‌లు లేదా ఉడ‌త‌ల‌ను వాటి చ‌ర్మం కోసం వేటాడుతుంటారు. ఆ చ‌ర్మ ఉత్ప‌త్తుల‌ను దేశం అంతా వ్యాపారం చేసేవాళ్లు. దీంతో వేలాది మందికి అప్ప‌ట్లో ప్లేగు వ్యాధి సోకింది. ఆ రోజుల్లో ఏడాదిలోనే వ్యాధిని నియంత్రించినా కేసులు మాత్రం అప్పుడ‌ప్పుడూ భ‌య‌పెడుతూనే ఉన్నాయి. ప‌చ్చి మార్మ‌ట్ మాంసాన్ని తిన‌డం వ‌ల్ల గ‌త ఏడాది మంగోలియాలో బుబోనిక్ ప్లేగు కేసులు న‌మోదు అయ్యాయి.

Tags :
|
|

Advertisement