Advertisement

  • భారత సరిహద్దుల్లో చైనా విస్తరణవాద ఎజెండా ప్రయత్నాలు కూలిపోతాయి: అమెరికా

భారత సరిహద్దుల్లో చైనా విస్తరణవాద ఎజెండా ప్రయత్నాలు కూలిపోతాయి: అమెరికా

By: chandrasekar Fri, 30 Oct 2020 6:54 PM

భారత సరిహద్దుల్లో చైనా విస్తరణవాద ఎజెండా ప్రయత్నాలు కూలిపోతాయి: అమెరికా


భారత్‌ సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తోన్న తీరును ప్రపంచం నిశితంగా గమనిస్తోందని అమెరికా వ్యాఖ్యానించింది. భారత్ విషయంలో చైనా విస్తరణవాద ఎజెండా ప్రయత్నాలు కూలిపోతాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికా, భారత్ రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య మంగళవారం జరిగిన చర్చల సందర్భంగా ఈ మేరకు అగ్రరాజ్యం స్పష్టం చేసింది. లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఏర్పడిన ప్రతిష్టంభన విషయంలో భారత్‌కు పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా పేర్కొంది. మే నెల తొలివారంలో ప్రారంభమైన ఉద్రిక్తతలు శీతాకాలంలోనూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక సమస్యలపై అమెరికా, భారత్ మధ్య కలయికను వేగవంతం చేసింది. భారతదేశం, శ్రీలంక, మాల్దీవుల పర్యటన సందర్భంగా చైనాపై మైక్ పాంపియో ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ద్వైపాక్షిక విషయాలలో అమెరికా జోక్యం చేసుకుంటోందని డ్రాగన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్-చైనాలు ఇప్పటికే పలుసార్లు చర్చించాయని, ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, తమ దేశానికి, భారత్‌కు మధ్య సంబంధాలు రాజకీయ పార్టీలకు అతీతమైనవని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్‌ ఓర్టగస్‌ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఈ సంబంధాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలకు సంబంధించిన రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రపంచ యవనికపై భారత్‌ కీలకమైన శక్తి అని అభిప్రాయపడ్డారు. భారత్‌ ఎదుగుదలను తాము స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు. అంతర్జాతీయంగా అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని వాటిని, భారత్‌తో కలిసి పరిష్కరించుకుంటామని తెలిపారు. అందుకు తమ దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అదే విధంగా డ్రాగన్‌పై విమర్శలు చేసారు మోర్గాన్‌. చైనా సృష్టించిన కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. వైరస్ పుట్టుకకు సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలన్నారు. నిజ నిర్ధారణ కోసం వైద్యులు, శాస్త్రవేత్తలను చైనాలోకి అనుమతించాలని చెప్పారు.

Tags :

Advertisement