Advertisement

  • లడఖ్‌లో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న చైనా

లడఖ్‌లో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న చైనా

By: chandrasekar Tue, 07 July 2020 3:11 PM

లడఖ్‌లో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న చైనా


భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత ప్రభుత్వం పటిష్టమైన రహదారుల నిర్మాణం చేపట్టడమే కాకుండా ఆ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. లడఖ్‌లో రహదారులు, భారీ వంతెనలు నిర్మిండం ద్వారా అన్ని ప్రదేశాలకు మార్గం సుగుమమం అయ్యేలా భారత్ కృషి చేస్తోంది.

దేశంలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ అయ్యేలా లేహ్ ఎయిర్ పోర్టును కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి పనులు ఆ ప్రాంతంలో జరిగే మిలిటరీ ఆపరేషన్స్‌ని సైతం సులభతరం చేయనున్నాయి. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు చైనా విస్తరణ కాంక్ష ఒకటైతే లడఖ్‌లో భారత ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కూడా ఓ కారణమని తెలుస్తోంది. లడఖ్‌లో భారత ప్రభుత్వం చేపడుతున్న మౌలికవసతుల అభివృద్ధి పనులు చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నట్టు సమాచారం.

లడఖ్ ప్రత్యేకతను చాటేలా లేహ్ ఎయిర్ పోర్టులో కుశక్ బకులా రింపోచె పేరిట కొత్తగా నిర్మిస్తోన్న టెర్మినల్‌‌ని కేంద్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తద్వారా లడఖ్‌ను దేశంలోనే అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని భారత్ యోచిస్తోంది. ఇప్పటికే లడఖ్‌కి వస్తున్న స్వదేశీ, విదేశీ పర్యాటకుల రాకతో లేహ్ ఎయిర్ పోర్టులో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లేహ్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడం ద్వారా మరింత మంది పర్యాటకులను ఆకర్షించుకోవచ్చని భారత్ భావిస్తోంది.

అయితే, లడఖ్ భూభాగాన్ని ఆక్రమించాలనే కాంక్షతో రగిలిపోతున్న చైనాకు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. లేహ్ ఎయిర్ పోర్టుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో అంటే 10,682 అడుగుల ఎత్తులో నిర్మించిన ఏకైక ఎయిర్ పోర్టు ఇదే. 2018-19 ఏడాదిలో లేహ్ ఎయిర్ పోర్టు నుంచి 8.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

రానున్న కొన్నేళ్లలో ఈ సంఖ్య రెండింతలు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ కేవలం 800 మంది మాత్రమే కాగా కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్‌లో ప్రయాణికుల సామర్థ్యం 1.6 మిలియన్‌గా ఉండనుందని అంచనా వేస్తున్నారు. 18 చెక్-ఇన్ కౌంటర్స్, 8 సెల్ఫ్ చెక్-ఇన్ కౌంటర్స్, 2 బ్యాగేజ్ బెల్ట్స్, 3 ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జీలు, 15 లిఫ్టులు, 11 ఎస్కలేటర్స్ ఈ మోడర్న్ టెర్మినల్ సొంతం.

లడఖ్ లోని సుందరమైన ప్రదేశాలు, బుద్దిజం, హిమాలయాల సొగసును వర్ణించేలా స్థూపాలు ఈ ఎయిర్ పోర్టులో కొలువుదీరనున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించి లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా తీర్చిదిద్దిన అనంతరం లడఖ్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. లడఖ్‌కి ఉన్న ఏకైక ఆదాయవనరు పర్యాటక రంగం కావడంతో ఆ ప్రాంతాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది.

అయితే, లడఖ్‌కి సరిహద్దుల అవతల ఉన్న చైనా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లడఖ్‌పై కన్నేసిన చైనా అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతోందని భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Tags :
|
|

Advertisement