Advertisement

హిమాలయ దేశం మీద కన్నేసిన భారత ప్రత్యర్ధులు

By: Sankar Thu, 02 July 2020 8:05 PM

హిమాలయ దేశం మీద కన్నేసిన భారత ప్రత్యర్ధులు


నేపాల్‌ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చైనా, పాకిస్తాన్‌ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు సమాచారం. హిమాలయ దేశంలో భారత్‌ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారీ కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. నేపాల్‌కు సుదీర్ఘ కాలంగా మిత్ర దేశంగా ఉన్న భారత్‌కు వ్యతిరేకంగా.. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహా.. పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే ఆయనను విమర్శిస్తూ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి గురువారం అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ముఖ్యనేత, మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్‌ దహల్‌), దేశ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా బలూవాటర్‌లోని ప్రధాని నివాసంలో కేబినెట్‌ కూడా సమావేశమైందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలను నిలిపివేసి, పార్లమెంటును ప్రొరోగ్‌ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓలికి పదవీ గండం పొంచి ఉన్న నేపథ్యంలో ఆయనకు బాసటగా నిలిచేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఓలితో ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం మాట్లాడనున్నారని ఓ జాతీయ మీడియా పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌.. ఓలికి మద్దతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నాళ్లుగా చైనాతో స్నేహం పెంచుకుంటున్న ఓలిని పాక్‌ సమర్థించడం, భారత్‌కు వ్యతిరేకంగా ఓలి వ్యాఖ్యలు చేయడం వెనుక డ్రాగన్‌ హస్తం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాగా పాక్‌ చైనా మిత్రదేశంగా కొనసాగుతుండగా.. నేపాల్‌ సైతం ఇటీవల చైనాతో సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది

Tags :
|
|
|

Advertisement