Advertisement

  • చైనా మా దేశ సరిహద్దులో ఎలాంటి నిర్మాణాలు చేయలేదు: భూటాన్

చైనా మా దేశ సరిహద్దులో ఎలాంటి నిర్మాణాలు చేయలేదు: భూటాన్

By: chandrasekar Sat, 21 Nov 2020 5:54 PM

చైనా మా దేశ సరిహద్దులో ఎలాంటి నిర్మాణాలు చేయలేదు: భూటాన్


భూటాన్ సరిహద్దు భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని భూటాన్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. భూటాన్ దేశంలోకి సుమారు 2 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగి౦ది. ఈ నేపథ్యంలో భూటాన్ రాయబారి స్పందించారు. తమ భూభాగంలో చైనా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని పేర్కొన్నారు. తమ భూభాగంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తాము అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిహద్దులో చైనా ఎలాంటి చొరబాట్లకు పాల్పడలేదని అన్నారు. చైనాకు చెందిన ఓ జర్నలిస్తు మాత్రం భూటాన్ భూభాగంలోనే చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ చెప్పుకొచ్చారు.

మీడియాలో వచ్చిన కథనాలు...

చైనా ఏకంగా ఒక గ్రామాన్నే భూటాన్ భూభాగంలో 2కి.మీ పరిధిలో ఏర్పాటు చేసింది. భారత్, చైనా, భూటాన్‌ల ట్రైజంక్షన్ డోక్లాంకు ఇది కేవలం 9కి.మీ దూరంలో ఉంది. ఈ విషయాన్ని చైనాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు ఫోటోలతో సహా ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టాడు. కానీ ఆ తర్వాత కొద్ది గంటలకే వాటిని తొలగించేశాడు. అయితే అప్పటికే ఆ ఫోటోలు భారత్ చేతికి చిక్కాయి. చైనా ఏర్పాటు చేసిన ఈ గ్రామం పేరు 'పాంగ్డా'గా చెప్పారు. భూటాన్ అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని చైనా అక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరకంగా భారత్ ఊహించిన భయాలే నిజమవుతున్నాయి. మూడు దేశాల కూడలిగా ఉన్న డోక్లాం భూభాగాన్ని చైనా క్రమ క్రమంగా ఆక్రమించుకునే ప్రమాదం ఉందని భారత్ ఎప్పుడో అంచనా వేసింది. పరిమిత సంఖ్యలో సాయుధ దళాన్ని కలిగిన భూటాన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా చైనా వ్యవహరిస్తుండటం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. గతంలో డోక్లాంలో చైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు భూటాన్ తరుపున భారతే గట్టిగా పోరాడింది. కొద్ది నెలల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ప్రతిష్ఠంభనకు అది దారితీసింది. చైనా చర్యలను భారత్ బలంగా తిప్పి కొట్టడంతో అప్పట్లో డ్రాగన్ వెనక్కి తిరగక తప్పలేదు.

Tags :
|

Advertisement