Advertisement

  • ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం సొరంగాలు తవ్వుతున్న చైనా...

ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం సొరంగాలు తవ్వుతున్న చైనా...

By: chandrasekar Tue, 15 Sept 2020 12:47 PM

ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం సొరంగాలు తవ్వుతున్న చైనా...


తాజాగా, మరో కుట్రకు తెరతీసి౦ది చైనా. ఒక వైపు శాంతి చర్చలు జరుపుతూ మరోవైపు కుట్రలు పన్నుతోంది డ్రాగన్ దేశం. పలుమార్లు ఘర్షణలకు దిగిన చైనా బలగాలు ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. తాజాగా, మరో కుట్రకు తెరతీసినట్లు భారత సైనిక అధికారులు గుర్తించారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతం ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణాన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం సొరంగాలు తవ్వుతున్నట్లు గుర్తించామని భారత సైనికాధికారులు వెల్లడించారు. కమ్యూనికేషన్ కోసం భారీ ఎత్తున కేబుల్స్ కూడా తీసుకొస్తున్నారని తెలిపారు. సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకే డ్రాగన్ దేశం ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. లఢఖ్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఇలాంటి పనులు చేస్తోందని అధికారులు తెలిపారు. అయితే, ఈ వ్యవహారంపై చైనా విదేశాంగ మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణ దిశగా సుమారు 70 కిలోమీటర్ల మేర భారత్, చైనా బలగాలు భారీ ఎత్తున మోహరించాయి. యుద్ధ ట్యాంకులు, విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

కమ్యూనికేషన్ కోసం..

గత వారం ఇరుదేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల భేటీ అనంతరం సరిహద్దులో ప్రశాంతత కోసం చైనా ముందుకు వస్తుందనుకుంటే అలా జరగలేదని ఓ భారత అధికారి తెలిపారు. సైనిక బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించలేదని చెప్పారు. ఈ క్రమంలో సరిహద్దులో ఇంతకుముందులానే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోందని తెలిపారు. లడఖ్‌లోని ప్రధాన నగరమైన లేహ్‌లో భారత వైమానికదళ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. సరిహద్దులో చైనా కదలికలపై ఓ కన్నేసి ఉంచాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా హైస్పీడ్ కమ్యూనికేషన్ కోసం చైనా సొరంగాలను తవ్వుతోందని భారత అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. చైనా వేగంగా పనులు పూర్తి చేస్తోందని తెలిపారు. ఉత్తర ప్యాంగ్యాంగ్ త్సో లేక్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేబుల్స్‌నే ఏర్పాటు చేస్తోందని భారత నిఘా సంస్థలు తెలిపినట్లు మరో అధికారి పేర్కొన్నారు. సెటిలైట్ ద్వారా చైనా కదలికలను పసిగట్టిన వెంటనే తాము అప్రమత్తమయ్యామని తెలిపారు. చైనా తన సరిహద్దులో మౌలిక సదుపాయాలను కూడా భారీగా ఎత్తున కల్పించుకుంటోందని చెప్పారు.

ఫొటోలు, డాక్యుమెంట్లు లాంటి డేటాను పంపడానికి చైనా ఏర్పాటు చేసుకుంటున్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా పంపించడానికి వీలుంటుందని మరో నిఘా అధికారి తెలిపారు. రేడియోలో చెప్పడం ద్వారా దొరికిపోయే అవకాశాలుంటాయని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా సమాచారం సురక్షితంగా చేరవేయడుతుందని చెప్పారు. ప్రస్తుతం భారత సైన్యం రేడియో కమ్యూనికేషన్ మీదే ఆధారపడి ఉందని చెప్పారు. అయితే, అది గుప్తీకరించబడి (ఎన్‌క్రిప్ట్‌డ్) ఉంటుందని తెలిపారు.

Tags :
|

Advertisement