Advertisement

చైనా చెరలో అరుణాఛల్‌ వేటగాళ్లు

By: Dimple Wed, 09 Sept 2020 09:23 AM

చైనా చెరలో అరుణాఛల్‌ వేటగాళ్లు

భారత్‌-చైనా సరిహద్దులోని అడవుల్లో వేటకు వెళ్లి అపహరణకు గురయ్యారని భావిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అయిదుగురు యువకుల జాడ తెలిసింది. వారందరూ తమ వద్దే ఉన్నట్టు ఎట్టకేలకు చైనా ఆర్మీ అంగీకరించింది. అడవిలో తప్పిపోయిన వారందరూ తమ భూభాగంలో కనిపించారని వెల్లడించింది. భారత సైన్యానికి అందించిన సమాచారంలో చైనా ఆర్మీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు కేంద్ర సహాయ మంత్రి, అరుణాచల్‌ప్రదేశ్‌ ఎంపీ కిరణ్‌ రిజిజు మంగళవారం ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

ఆ అయిదుగురిని వెనక్కి తీసుకొచ్చే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారు ఝామున 4.30 గంటల సమయంలో హాట్‌లైన్‌ ద్వారా భారత సైనికులకు ఆ వేటగాళ్ల సమాచారాన్ని చైనా ఆర్మీ తెలిపినట్లు సమాచారం. సోమవారం అయిదుగురు వేటగాళ్ల సమాచారాన్ని తెలిపేందుకు చైనా నిరాకరించిన విషయం తెలిసిందే.

అప్పర్‌ సుబాన్‌సిరి జిల్లా నాచో ప్రాంతం నుంచి వేటకు వెళ్లిన ఆ అయిదుగురిని గురువారం మెక్‌మోహన్‌ రేఖ వద్ద చైనా సైన్యం అపహరించిందని...ఈ ఘటన నుంచి తప్పించుకొని వచ్చిన ఇద్దరు యువకులు వెల్లడించారు. మెక్‌మోహన్‌ రేఖ వద్ద సరిహద్దుపై స్పష్టత లేకపోవటం, ఆ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో రెండు వైపులనున్న స్థానిక తెగల ప్రజలు తరచూ ఇరు దేశాల భూభాగాల్లోకి వెళ్తుంటారని, దీనిని అంత తీవ్రంగా భావించాల్సిన అవసరం లేదని సైనిక వర్గాలు తెలిపాయి.

Tags :
|

Advertisement