Advertisement

  • గల్వాన్‌ నదీ ప్రవాహానికి ఆటంకాలు ఏర్పరుస్తున్న చైనా

గల్వాన్‌ నదీ ప్రవాహానికి ఆటంకాలు ఏర్పరుస్తున్న చైనా

By: chandrasekar Sat, 20 June 2020 10:46 AM

గల్వాన్‌ నదీ ప్రవాహానికి ఆటంకాలు ఏర్పరుస్తున్న చైనా


గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా మరో ఎత్తుగడకు పాల్పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గల్వాన్‌ నదీ ప్రవాహానికి ఆటంకాలు ఏర్పరిచేందుకు లేదా అడ్డుకునేందుకు చైనా బుల్డోజర్లను మోహరించడం ఆందోళన కలిగిస్తున్నది. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల ప్రాంతానికి కేవలం కిలోమీటరు దూరంలోనే ఈ వాహనాలు ఉండటం గమనార్హం.

అమెరికాలోని ‘ప్లానెట్‌ ల్యాబ్స్‌' సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్‌ఏసీకి అటువైపున ఉన్న భాగాల్లో చైనా ఐదు కిలోమీటర్ల మేర పలు బుల్డోజర్లను మోహరించింది.

వాహనాలు ఉన్న ప్రాంతాల్లో గల్వాన్‌ నదీ ప్రవాహం క్రమంగా మారుతున్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నది. బుల్డోజర్లు మోహరించిన ప్రాంతాల్లోకి చేరుకోగానే బురద రంగులోకి మారినట్టు తెలుస్తున్నది. బుల్డోజర్ల సాయంతో నీటి ప్రవాహాన్ని మట్టితో నిలిపి వేయడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే నదికి ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నదన్న కారణాలు తెలియ లేదు. ఎల్‌ఏసీకి ఇటువైపున (భారత్‌ వైపునకు) ఉన్న నదీ జలాలు సాధారణ స్థితిలోనే ఉన్నట్టు ఆయా చిత్రాల ద్వారా తెలుస్తున్నది. గల్వాన్‌ లోయలోని గస్తీ కేంద్రం14 వద్ద బుధవారం ఇరు దేశాలకు చెందిన మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య మరో దఫా చర్చలు జరిగాయి.

ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, సరిహద్దుల నుంచి తమ బలగాలను వెనక్కి పంపడానికి చైనా నిరాకరించిందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఎల్‌ఏసీకి ఇటువైపున రెండు కిలోమీటర్ల దూరంలో గల్వాన్‌ లోయ ప్రాంతంలో నది ఒడ్డున భారత సైన్యానికి చెందిన లారీలు మోహరించినట్టు చిత్రాల్లో స్పష్టమవుతున్నది.

Tags :
|
|

Advertisement