Advertisement

  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

By: chandrasekar Sat, 15 Aug 2020 4:41 PM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు


విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ జెండాను ఆవిష్కరించగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం గౌరవ వందనం స్వీకారం జరిగింది. సీఎం ప్రసంగిస్తూ స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనం చేశారు. ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ది సాదించగలమని అధికార వికేంద్రకరణ జరగకపోతే సమన్యాయం పుస్తకాలకే పరిమితం అవుతాయి అంటూ రాజధాని అంశాన్ని ప్రస్తావించారు.

అన్ని జిల్లాలకు అభివృద్ది సమానంగా జరగాలన్నారు. సమన్యాయం కోసం పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు జగన్. రాష్ట్ర విభజన ద్వారా కలిగిన గాయాలు మానాలన్నా అలాంటి గాయాలు లేకుండా జాగ్రత్త పడాలన్నా రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నా వికేంద్రీకరణ సరైనదని నిర్ణయించామన్నారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లుల్ని చట్టంగా మార్చామన్నారు. సామాజిక ఆర్థిక భరోసాను రాజ్యాంగం కల్పించిందన్నారు సీఎం.

ప్రజల అవసరాల నుంచి పుట్టిన ప్రభుత్వం రైతు భరోసా, చేయూత, అమ్మ ఒడి, ఆసరా,కాపు నేస్తం, గోరు ముద్ద, నాడు-నేడు వంటి నిధుల్ని తీసుకొచ్చామన్నారు. పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సంక్షేమ పథకాలతో అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏ పౌరుడూ కులం, మతం ప్రాతిపదికన అన్యాయానికి గురికాకూడదని. అసమానతలు తొలగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరింత అభివృద్ది చెందాలని కులం, మతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు.

ఇంగ్లీష్ మీడియం పేదలకు అందకపోతే రాజ్యాంగం ఎవరి కోసం అన్న భావన వస్తుంది అన్నారు జగన్. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని చెప్పారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఆడబిడ్డల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని అలాగే వారి రక్షణకు దిశ చట్టం చేశామన్నారు.

అలాగే నామినేటెడ్ పోస్టులు, పనుల్లో 50శాతం అక్క చెల్లెమ్మలకు ఇస్తూ చట్టం తీసుకొచ్చామని అలాగే 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలకు రంగం సిద్ధమైంది అన్నారు. రాష్ట్ర హోంమంత్రి కూడా మహిళకు ఇచ్చామని గుర్తు చేశారు. ఇక మద్యం కుటుంబాల్లో చిచ్చు పెడుతోందని మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు జగన్. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చామని అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, పురుగులమందులు, ఎరువులు అందిస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టును 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు, కరువు నివారణ ప్రాజెక్ట్, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నామన్నారు.

ఈ ఏడాది ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల కోసం రాజీలేని ధోరణని ఆచరణ చేసి చూపిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. కొత్త పారిశ్రామిక విధానంలో కూడా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి అన్నారు. ఇక కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆశిస్తున్నాను అన్నారు జగన్. కేంద్రం ఇతర పార్టీల మీద ఆధారపడే పరిస్థితి లేదని హోదాను డిమాండ్ చేస్తూనే ఉంటామన్నారు. ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

Tags :
|

Advertisement