Advertisement

  • చెలరేగిన చెన్నై సూపర్‌ కింగ్స్... పేలవంగా ఓడిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌

చెలరేగిన చెన్నై సూపర్‌ కింగ్స్... పేలవంగా ఓడిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌

By: chandrasekar Mon, 05 Oct 2020 09:36 AM

చెలరేగిన చెన్నై సూపర్‌ కింగ్స్... పేలవంగా ఓడిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌


ఆదివారం బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్ చెలరేగి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ పై విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్‌-2020లో KXIP vs CSK ల మధ్య జరిగిఆన్ మ్యాచ్ లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన ప్రదర్శన చేసింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై చెన్నై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుస ఓటములతో ఢీలాపడిన చెన్నై జట్టులో ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (83 నాటౌట్‌ : 53 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు), డుప్లెసిస్‌ (87 నాటౌట్:‌ 53 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్స్‌) అజేయంగా నిలిచి అద్వితీయ విజయాన్నందించారు. వీరిద్దరి విధ్వంసంతో చెన్నై వికెట్‌ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్‌ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కనీసం ఓపెనింగ్‌ జోడీని కూడా విడదీయలేకపోయారు. ఆరంభం నుంచి ఆఖరి వరకు వీరిద్దరూ వీరవిహారం చేయడంతో పంజాబ్‌ బౌలర్లు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది.

చెన్నై ఓపెనర్లు నిలదొక్కుకోవడం వల్ల బౌలర్లు తేలిపోవడంతో సీజన్‌లోనే పంజాబ్‌ అత్యంత దారుణ పరాజయాన్ని చవిచూసింది. సాధారణ లక్ష్య చేధనతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఎలాంటి తడబాటుకు గురికాకుండా అవలీలగా విజయాన్ని అందుకుంది. అంతకుముందు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (63: 52 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌), నికోలస్‌ పూరన్‌ (33: 17 బంతుల్లో ఫోర్‌, 3సిక్సర్లు) రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌ ఒంటిచేత్తో నడిపించాడు. మయాంక్‌ అగర్వాల్ ‌(26), మన్‌దీప్‌ సింగ్ ‌(27) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టగా జడేజా, చావ్లా చెరో వికెట్‌ తీశారు. చెన్నై సూపర్‌ కింగ్స్ ఫీల్డింగ్ బాగా చేసి పంజాబ్ ను 178 పరుగులకు కట్టడి చేశారు.

Tags :
|

Advertisement