Advertisement

ఏపీలో సెంచరీ కొట్టిన ఉల్లి ధర...

By: chandrasekar Thu, 22 Oct 2020 09:16 AM

ఏపీలో సెంచరీ కొట్టిన ఉల్లి ధర...


ఆంధ్ర ప్రదేశ్ లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. నిత్యావసరాల్లో ముఖ్యమైన ఉల్లి ధర భారీగానే పెరుగుతుంది. ఉల్లి ధర ఘాటెక్కిస్తోంది. రూ.40 నుంచి మొదలైన ఉల్లి ధర పెంపు కొత్త వ్యవధిలోనే రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది. విజయవాడ నగరంలోని వినియోగదారులకు రోజుకు 70-80 టన్నుల ఉల్లిపాయలు అవసరమవుతాయి. ఒక్కో రైతుబజార్‌కు రోజుకు 10-12 టన్నుల ఉల్లిపాయలు అవసరం. అయితే, ప్రస్తుతం రోజుకు రెండు టన్నుల సరుకు రావడమే గగనంగా మారింది. బయటి మార్కెట్లకూ సరఫరా తగ్గిపోయింది.

ప్రతి సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలల్లో మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి ఉల్లి సరుకు వస్తుంది. సెప్టెంబరు నుంచి జనవరి వరకు కర్నూలు జిల్లాతోపాటు, కర్ణాటక నుంచి ఉల్లి వస్తుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైయింది. చేతికి అందాల్సిన పంట కొట్టుకుపోయింది. లాక్‌డౌన్‌ సమయంలో గోడౌన్లలో బ్లాక్‌ అయిన ఉల్లిపాయలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ సరుకు మరో 2 వారాలు మాత్రమే సరిపోతుందని, ఆ తర్వాత పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల ధర మరింత పెరగవచ్చని తెలిపారు.

ప్రతిరోజు ప్రజల అవసరాలకు షోలాపూర్‌ నుంచి 200-300 లారీలు, కర్నూలు నుంచి 200 లారీలు, కర్ణాటక నుంచి 600 లారీల ఉల్లిపాయలు విజయవాడకు వస్తుంటాయి. అటువంటిది రోజుకు పది లారీల సరుకు రావట్లేదని చెబుతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో రూ.80-85 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ.100కు విక్రయిస్తుండటంతో వినియోగదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గడచిన ఏడాది ఇదే సమయంలో కిలో ఉల్లి ధర రూ.170 ఉందని, రాబోయే రోజుల్లో దాన్నీ బ్రేక్‌ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాగే సాగితే పేద మరియు మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

Tags :
|
|
|

Advertisement