Advertisement

హైదరాబాద్ వరదలకు కేంద్ర సాయం 224 కోట్లు

By: Sankar Sun, 01 Nov 2020 11:26 AM

హైదరాబాద్ వరదలకు కేంద్ర సాయం 224 కోట్లు


భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్‌ఎఫ్‌)కి ముందస్తుగా రూ.224.50 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఇళ్లు కోల్పోయిన వారికి, ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించాలని నిర్దేశించింది. నిబంధనల ప్రకారం ఈ నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో విడుదల చేయాల్సి ఉన్నా.. పునరావాస పనులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, నిధుల ఆవశ్యకతను వివరించేలా ప్రత్యేక నివేదిక పంపారు.

ఈ నేపథ్యంలో ముందస్తుగా కొంత మేర నిధులను విడుదల చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. విపత్తు నిర్వహణ నిధులు విడుదల పట్ల మంత్రి కిషన్‌రెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉండగా, హైదరాబాద్‌ను సందర్శించి వరద నష్టాన్ని అంచనా వేసిన అధికార బృందం నివేదిక కేంద్రానికి అందాల్సి ఉంది. ఈ నివేదికకు అనుగుణంగా సమగ్ర వరద ఉపశమన ప్యాకేజీని ప్రకటించే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించనుంది.

Tags :
|

Advertisement